పోలీసులంటే.. సమాజంలో జరిగే అన్యాయాన్ని, అక్రమాలను అడ్డుకుని.. నేరాలు జరగకుండా చూసుకుంటూ ప్రజలకు భద్రత కల్పించే రక్షణభటులు. రాత్రనకా పగలనకా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలిపోయి ప్రజలకు భరోసా కల్పించే పోలీసులకు సమాజంలో మంచి పేరు, గౌరవం ఉంది. కానీ.. తులసివనంలో గంజాయి మొక్కల్లా.. కొంతమంది చేస్తున్న పనుల వల్ల డిపార్ట్ మెంట్ మొత్తానికి చెడ్డపేరు వస్తోంది. చెడుదారిలో వెళ్తుంది తమవాళ్లే అయినా దండించి సక్రమమైన మార్గంలో పెట్టేందుకు పోలీసు శాఖ ఏమాత్రం వెనకాడట్లేదు. ఈ క్రమంలోనే పక్కదారి పట్టిన ఓ కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన.. వరంగల్ కమిషనరేట్ పరిధిలో జరిగింది.
తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా మార్చారన్న లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఎక్కడ చిన్న సమాచారం వచ్చినా.. డేగల్లా వాలిపోయి గంజాయి, డ్రగ్స్ స్మగ్లర్ల తాట తీస్తున్నారు పోలీసులు. కాగా.. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ.. ఎంత నిఘా పెట్టినప్పటికీ.. చాప కింద నీరుగా మాదకద్రవ్యాల సరఫరా మాత్రం ఆగట్లేదు. ఓవైపు.. ఈ మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో పెకిలించేయాలని ప్రభుత్వం కట్టుకుంటే.. అందుకు కృషి చేయాల్సి పోలీసుల్లోనే.. ఓ కానిస్టేబుల్ సైలెంట్‌గా అదే దందాను నడిపిస్తున్నాడు. కానీ.. తప్పు ఎవ్వరు చేసినా ఎక్కువ రోజులు చట్టం నుంచి తప్పించుకోలేరు. చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అసలు ఎలా దొరికాడంటే.
కాజీపేట పోలీసు డివిజన్‌లో పని చేస్తున్న ఓ కానిస్టేబుల్ జోరుగా గంజాయి దందా సాగిస్తున్నాడు. నర్సంపేటకు చెందిన ఈ కానిస్టేబుల్ ఇంట్లో.. భారీగా గంజాయి ఉన్నట్లు గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారించగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే.. సదరు కానిస్టేబుల్ పని చేస్తున్న పోలీస్ స్టేషన్ పరిధిలో.. గతంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. దాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారు. అయితే.. అదే పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఈ కానిస్టేబుల్ దృష్టి ఆ గంజాయిపై పడింది. ఇంకేముంది.. ఎవ్వరికీ తెలియకుండా కొంచెం కొంచెంగా నొక్కేయడం మొదలుపెట్టాడు. దాన్ని తన ఇంట్లోనే దాచిపెట్టి.. బాగా తెలిసిన వారి ద్వారా అమ్మటం స్టార్ట్ చేశాడు. చాలా రోజులుగా దందా సాఫీగానే సాగింది.
ఎప్పటిలాగే తనకు తెలిసిన వారికి తన ఇంట్లో ఉన్న గంజాయిని అమ్మేందుకని అప్పజెప్పాడు. ఆ దుండగులు.. వరంగల్ నుంచి నర్సంపేటవైపు బైక్ మీద వెళ్తున్నారు. అదే సమయంలో నర్సంపేట డివిజన్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అయితే.. పోలీసులను చూసి గంజాయి తీసుకొస్తున్న దుండగులు.. పారిపోయేందుకు ప్రయత్నించారు. అనుమానం వచ్చిన పోలీసులు.. ఆ బైకును వెంబడించారు. ఈ క్రమంలో ఒకరు పోలీసులకు చిక్కాడు. పరీక్షిచగా అతని వద్ద ఎండు గంజాయి దొరికింది. అసలు అది ఎవరిచ్చారు.. ఎవరికి ఇవ్వబోతున్నారంటూ పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం కక్కేశాడు. సదరు కానిస్టేబుల్ నుంచే ఆ గంజాయిని తీసుకొని కావల్సిన వారికి విక్రయిస్తున్నట్లు ఆ దుండగుడు పోలీసులకు చెప్పాడు. దీంతో.. కానిస్టేబుల్ గంజాయి బాగోతం బయటపడింది. వెంటనే.. సదరు కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa