ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైడ్రాకు భారీగా నిధులు విడుదల.. కూల్చివేతలు మళ్లీ షురూ..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 03, 2024, 08:05 PM

హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల సంరక్షణ కోసం రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా.. విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లతో పాటు ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేస్తూ.. అక్రమార్కుల గుండెల్లో బుల్డోజర్లు పరిగెత్తించి.. ప్రకంపనలు సృష్టించింది. ఈ నేపథ్యంలోనే.. హైడ్రాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది.


మంగళవారం (డిసెంబర్ 03న) రోజున.. రూ.50 కోట్ల నిధులు విడుదల చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైడ్రా కార్యాలయ నిర్వహణతో పాటు వాహనాల కొనుగోలుకు ఈ నిధులను వినియోగించనున్నట్టు తెలుస్తోంది. దీంతో.. హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో కూల్చివేతలకు బ్రేక్ ఇచ్చిన హైడ్రా.. మరోసారి రంగంలోకి దిగేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. దీంతో.. అక్రమార్కుల గుండెల్లో టెన్షన్ నెలకొంది.


హైడ్రా అంటే కేవలం కూల్చివేతలే కాదు నిర్మాణాలు కూడా అంటూ కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పినట్టుగానే.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే.. అభివృద్ధిని నోచుకోని, ఆక్రమణలకు గురవుతూ కనమరుగవుతున్న చెరువులు, కుంటలను గుర్తించి.. వాటిని పునరుద్ధరించే కార్యక్రమాలను హైడ్రా చేపట్టింది. ఈ క్రమంలో ఇప్పటికే.. పలు చెరువులు, కుంటలను హైడ్రా అభివృద్ధి చేస్తోంది.


ఇదిలా ఉంటే.. ప్రభుత్వ ఆస్తులు కాపాడేందుకు, చెరువులు, కుంటలను అభివృద్ధి చేసి పునరుజ్జీవింపజేసేందుకు గానూ.. హైడ్రాకు మరిన్ని శక్తివంతమైన అధికారాలు ఇవ్వడం కోసం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ద్వారా హైడ్రా అనేక విస్తృత అధికారాలను పొందుతూ.. చెరువులతో పాటు ప్రభుత్వ ఆస్తులను రక్షించటంలో కీలక పాత్ర పోషించనుంది. ఈ మేరకు.. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను అధునాతన సాంకేతిక పద్ధతులు, వాహనాల కొనుగోలు, కార్యాలయ నిర్వహణకు ఉపయోగించనున్నారు. ఈ నిధులు హైడ్రా పనితీరుకు మరింత బలం చేకూరుస్తాయని అధికారులు భావిస్తున్నారు.


హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటల పరిరక్షణ కోసం జూలై 19వ తేదీన హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో 99ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కాగా.. ఏర్పాటు చేసిన వారం రోజుల్లోనే రంగంలోకి దిగిన హైడ్రా.. జూలై 26 నుంచి కూల్చివేతలను మొదలుపెట్టింది. ఇప్పటి వరకు 30 ప్రాంతాల్లో 300 ఆక్రమణలను కూల్చివేసింది. హైడ్రా ఏర్పాటు చేసిన 100 రోజుల వ్యవధిలోనే.. 300 అక్రమ నిర్మాణాలకుపైగా నేలమట్టం చేసి.. రాష్ట్రవ్యాప్తంగా ప్రకనంపనలు సృష్టించింది.


100 రోజుల్లో ఏకంగా 120 ఎకరాలను అక్రమార్కుల చెర నుంచి విడిపించి.. ప్రభుత్వానికి అప్పగించింది. జీహెచ్‌ఎంసీతో పాటు 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల్లోని ఆక్రమణలపై హైడ్రా బుల్డోజర్లు పంజా విసిరాయి. ఈ క్రమంలో.. సినిమా సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు, సామాన్యులు అని తేడా లేకుండా.. అక్రమంగా నిర్మించిన కట్టడాలపైకి దూసుకెళ్లి.. రాష్ట్రవ్యాప్తంగా ఓ సంచలనానికి కేంద్ర బిందువుగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa