తెలంగాణ తల్లి రూపాన్ని మార్చుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. కాంగ్రెస్ అనుకూల వర్గంతో పాటు, బీఆర్ఎస్ వ్యతిరేక వర్గం.. రేవంత్ రెడ్డి సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తుండగా.. బీఆర్ఎస్ వర్గీయులు, పలువురు సాహితీవేత్తలు, సామాన్య ప్రజల నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకత వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. ప్రముక కవి, సాహితీవేత్త నందిని సిధారెడ్డి కూడా తెలంగాణ తల్లి రూపం మార్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను వేరు చేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి నిరసనగా.. ప్రభుత్వం అందించాలని భావించిన పురస్కారాన్ని నిర్మొహమాటంగా తిరస్కరించారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి రాగా.. ఆయన తీసుకున్న నిర్ణయంపై కేటీఆర్, హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు.
అయితే.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా రాష్ట్రంలోని పలువురు సాహితీవేత్తలు, కవులు, కళాకారులను ప్రభుత్వం తరఫున సత్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.. వారికి ఫ్యూచర్ సిటీలో 300 గజాల ఇంటి స్థలంతో పాటు కోటి రూపాయల నగదు పురస్కారం అందించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఇదే విషయాన్ని అంతకుముందే ప్రభుత్వం తరపున ఓ అధికారి నందిని సిధారెడ్డికి ఫోన్ చేసి తెలియజేయగా.. నిర్ద్వందంగా తిరస్కరించారు. "కోటి రూపాయలు ముఖ్యం కాదు. కోట్లాది ప్రజల గుండెల తల్లి ముఖ్యం. అందుకే ప్రభుత్వ పురస్కారాన్ని తిరస్కరించా.." అంటూ నందిని సిధారెడ్డి ప్రకటించారు. నందిని సిధారెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు స్వాగతించారు.
తెలంగాణ తల్లి రూపం మార్చి బతుకమ్మను తొలగించడం రాష్ట్ర చరిత్ర, సంస్కృతితో పాటు ఆత్మగౌరవానికి చెరగని మచ్చ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. సంస్కృతిని హననం చేసే ప్రభుత్వం చేత సన్మానం చేయించుకోలేనని ప్రకటించి రేవంత్ ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ప్రముఖ కవి నందిని సిధారెడ్డి తీసుకున్న సాహసోపేతమైన ఉదాత్త నిర్ణయం ప్రతి తెలంగాణ వాసికి గర్వకారణమని అభివర్ణించారు. తెలంగాణ ఆత్మగౌరవం, సంస్కృతి పరిరక్షణకు సిధారెడ్డి చూపిన నిబద్ధతకు కేటీఆర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆత్మగౌరవ పరిరక్షణ ఉద్యమంలో మార్గదర్శకత్వానికి శిరస్సు వంచి నమస్కారాలు తెలిపారు.
"కోటి రూపాయల కన్నా.. కోట్లాది ప్రజల గుండెల్లో కొలువైన తెలంగాణ తల్లే మిన్న, బతుకమ్మను తీసేయడం అంటే తెలంగాణ బతుకును అవమానించడమే అని.. ప్రభుత్వ పురస్కారాన్ని తిరస్కరిస్తూ.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చాటిన నందిని సిధారెడ్డి గారికి హృదయపూర్వక ఉద్యమాభినందనలు." అంటూ హరీష్ రావు కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa