ఆరకోర వేతనాలతో ఇరవై ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సమగ్ర శిక్షా అభియాన్ ఒప్పంద ఉద్యోగులు క్రమబద్ధీకరణ కోసం మరోసారి పోరుబాట పట్టారు. ముందుగానే అధికారులకు సమ్మె నోటీస్ లు అందించారు. ఈ నెల పది నుండి సమ్మె బాట పట్టారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న వీరంతా విద్యాభివృద్ధికి ప్రభుత్వ కార్యక్రమాలు క్షేత్ర స్థాయికి తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కేజీబీవీల్లో ఉపాద్యాయులు పేద విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేస్తున్నారు. ప్రభుత్వం తమను గుర్తించి సుప్రీం కోర్టు ప్రకారం సమాన పనికి సమాన వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని, తమను పర్మినెంట్ చేయాలని కొంతకాలంగా కోరుతున్నారు.
హామీ అమలు చేయాలని..
గతేడాది దాదాపు 25 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టిన సందర్భంలో ప్రస్తుత సీఎం, నాటి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మద్దతు ప్రకటించారు. మేం అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. హామీ నిలబెట్టుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.
విద్యాశాఖపై ప్రభావం
విద్యాశాఖలో జిల్లాలో మొత్తం 874 మంది సమగ్ర శిక్షా అభియాన్ లో పనిచేస్తున్నారు. జిల్లా స్థాయిలో ఏపిఓలు, డిపిఓలు, సాంకేతిక నిపుణులు, కంప్యూటర్ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. మండల స్థాయిలో ఎంఐఎస్ లు, కంప్యూటర్ సహాయకులు, ప్రత్యేక అవసరాల పిల్లలకు సేవలు అందించే భవిత కేంద్రాల్లో ఉపాద్యాయులు, రిసోర్స్ పర్సన్లు, పాఠశాల స్థాయిలో ఆర్ట్ క్రాఫ్ట్, పీఈటీలు, సహాయకులు, కేజీబీవీల్లో పనిచేసే ఉపాధ్యాయులు, ప్రత్యేకాధికారులు, ఏఎన్ ఎంలు, పీఈటీలు, అకౌంటెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, వంట పనిచేసే వారు, వాచ్ మెన్లు, స్వీపర్లు , స్కావెంజర్లు పని చేస్తున్నారు. వారంతా సమ్మెలోకి వెళ్లడం వల్ల విద్యాశాఖపై ప్రభావం చూపుతుంది.
డిమాండ్లు ఇవే
- ఇరవై ఏళ్లుగా తక్కువ వేతనంతో నిర్వహిస్తున్న పనికి తగిన వేతనం, ఉద్యోగ భద్రత లేదు. సమగ్ర శిక్షా ఉద్యోగులందరిని రెగ్యులర్ చేయాలి.
- రెగ్యులర్ చేయడంతో పాటు కనీస వేతన చట్టం అమలు చేయాలి.
- ఇరవై లక్షల జీవిత భీమా, పది లక్షల ఆరోగ్య భీమా వర్తింపచేయాలి.
- పీఈటీలకు సైతం సాధారణ ఉద్యోగుల మాదిరిగా ఏడాదికి 12 నెలల వేతనం ఇవ్వాలి.
- పదవీ విరమణ సమయంలో ఇరవై లక్షలు ఇవ్వాలి.
వెంటనే ప్రభుత్వం స్పందించాలి
ప్రభుత్వం నుండి సానుకూల స్పందన వస్తుందని భావిస్తున్నాం. లేదంటే మా న్యాయమైన డిమాండ్ లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తాం. గతంలో 25 రోజుల పాటు రిలే నిరాహారదీక్షలు చేపట్టి ప్రభుత్వానికి, ఉన్నత అధికారులకు విన్నవించుకున్నాం. అయినా మా సమస్యలు పరిష్కారం కాలేదు.మాకు ఇచ్చిన హామీ నేరవేర్చాలని కోరుతూ సమ్మె బాట పట్టడం జరిగింది.