సంధ్య థియేటర్ ఘటనలో పోలీసులదే తప్పన్నట్లుగా హీరో అల్లు అర్జున్ మాట్లాడుతున్నారని పోలీసు అధికారుల సంఘం ప్రతినిధి ఏసీపీ విష్ణుమూర్తి ఫైరయ్యారు. డబ్బు మదంతో గతకొన్ని రోజులుగా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన విష్ణుమూర్తి.. తాము ఒక్క పది నిమిషాలు తప్పుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. సంథ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ఓ రిమాండ్ ఖైదీ అని అన్నారు. కేసు విచారణ కోర్టులో ఉండగా ఓ ముద్దాయి ప్రెస్ మీట్ పెట్టొచ్చా? అని ఆయన ప్రశ్నించారు. ఈ పాయింట్‌తో ఆయన బెయిల్ రద్దు చేసే ఛాన్స్ కూడా ఉందని అన్నారు.
సంధ్య థియేటర్ దగ్గర గ్యాదరింగ్ వద్దని పోలీసులు చెప్పినా.. అల్లు అర్జున్ వినిపించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ బాధ్యత గల పౌరుడిగా ప్రవర్తించలేదని మండిపడ్డారు. అల్లు అర్జున్ చేసిన పనులు రాజ్యాంగానికి, చట్టానికి లోబడి ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఆయనేమీ పాలుతాగే పిల్లాడు కాదని.. జాగ్రత్తగా, హుందాగా వ్యవహరించాలన్నారు. ఒక సెలెబ్రిటీగా ఉన్న వ్యక్తి చట్టాల గురించి, తన పరిధి గురించి తెలుసుకోవాలని హితవు పలికారు. బాధిత కుటుంబానికి కొంత మెుత్తం ఇవ్వాలనుకుంటున్నట్లు ప్రెస్‌మీట్‌లో చెప్పారని ఈ చర్య పరోక్షంగా బాధితులను ప్రలోభానికి గురిచేసినట్లే అవుతుందన్నారు.
శనివారం నాటి ప్రెస్‌మీట్‌లో అల్లు అర్జున్ కళ్లలో తనకు ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదన్నారు. ఈ పదిహేను రోజుల నుంచి సక్సెస్ మీట్‌లు పెట్టుకోలేకపోతున్నాననే బాధ మాత్రమే కనిపించింది తప్ప.. ఆయనలో ఎలాంటి విచారం లేదని అన్నారు. బెయిల్‌పై ఇంటికి వెళ్లిన తర్వాత.. తన ఇంటిని ఒక ఫంక్షన్ హాల్‌లాగా మార్చేసి, వచ్చేవాళ్లు, పోయేవాళ్లతో చాలా హ్యాపీగా గడిపేస్తున్నారన్నారు. చట్టం ఎప్పుడూ బాధితుల పక్షానే ఉంటుందని అన్నారు.
సంథ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ బౌన్సర్ల తోపులాటతోనే రేవతి అనే మహిళ చనిపోయిందని ఏసీపీ విష్ణుమూర్తి ఆరోపించారు. బౌన్సర్లతో దౌర్జన్యం కరెక్ట్ కాదని.. పబ్లిక్ ప్లేసులలో సెలెబ్రెటీలు బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. పోలీసులు తమ డ్యూటీలు సరిగ్గానే నిర్వహించారని.. పోలీసులంటే కనీస గౌరవం లేకుండా అల్లు అర్జున్ మాట్లాడటం సరికాదన్నారు. పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేయడం ఇక నుంచైనా మానుకోవాలని.. అధికారులను ఇష్టం వచ్చినట్లు తిడితే రీల్స్ కట్ చేస్తామన్నారు. పబ్లిక్‌లో జాగ్రత్తగా ఉండాలని.. లేదంటే బట్టలూడదీస్తామని ఏసీపీ విష్ణుమూర్తి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.