ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు : సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 24, 2024, 04:23 PM

తెలంగాణ రాష్ట్రంలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప‌ట్ల రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఆగ్ర‌హాంతో ఉన్నార‌ని తెలిపారు. హ‌రీశ్‌రావు నేష‌న‌ల్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.చ‌ట్టం నీకు, కాంగ్రెస్ నాయ‌కుల‌కు చుట్ట‌మా రేవంత్ రెడ్డి..? సినీ న‌టుడు అల్లు అర్జున్ విష‌యంలో చూపుతున్న చొర‌వ‌ను అన్ని వ‌ర్గాల మీద చూపాల‌నే బీఆర్ఎస్ కోరుతున్న‌ది. ఒక వ్య‌క్తిని టార్గెట్ చేసి కేసులు పెడుతున్న‌ట్లుగా క‌న‌బ‌డుతున్న‌ది. రేవతి అనే మ‌హిళ చ‌నిపోవ‌డం దుర‌దృష్ట‌క‌రం. ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం వ‌ల్ల 50 మందికి పైగా గురుకుల పిల్ల‌లు చ‌నిపోతే ఇంత వ‌ర‌కు స్పంద‌న లేదు. ఆ పిల్ల‌ల ప్రాణాల‌కు విలువ లేదా సీఎం రేవంత్ రెడ్డి. ఆ పిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు ఎందుకు ఒక్క రూపాయి ఎక్స్‌గ్రేషియా ఇవ్వ‌లేదు..? ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్ మంత్రిగా మీరే ఉన్నారు క‌దా..? అని సీఎంను హ‌రీశ్‌రావు నిల‌దీశారు.


నీ త‌మ్ముడి అరాచ‌కాల వ‌ల్ల చ‌నిపోతున్నాన‌ని సూసైడ్ నోట్ రాసి మాజీ స‌ర్పంచ్ సాయిరెడ్డి ఆత్మ‌హ‌త్య చేసుకుంటే ఎందుకు ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌లేదు. ఇంత వ‌ర‌కు నీ త‌మ్ముడిని ఎందుకు అరెస్టు చేయ‌లేదు. చ‌ట్టం అంద‌రికీ స‌మానంగా ఉండాలి క‌దా..? చ‌ట్టం నీకు చుట్ట‌మైందా..? 80 మందికి పైగా ఆటో డ్రైవ‌ర్లు చ‌నిపోతే నీలో చ‌ల‌నం లేదు. 450 మందికి పైగా రైతులు చ‌నిపోతే నీలో స్పంద‌న లేదు. కానీ ఒక వ్య‌క్తిని టార్గెట్ చేసి ఉద్దేశ‌పూర్వ‌కంగా అరెస్టు చేయ‌డం వ‌ల్ల రాష్ట్రం ఇమేజ్ దెబ్బ‌తిని న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉంది. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన కాంగ్రెస్ గూండాలంతా రేవంత్‌తో ఫొటో దిగారు. వాళ్లే అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేశారు. సిద్దిపేట‌లో కూడా గూండాల‌తో నా క్యాంపు ఆఫీసు మీద దాడి చేయించార‌ని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు.


ప్ర‌శ్నించే గొంతుల మీద కాంగ్రెస్ ప్ర‌భుత్వం దాడి చేస్తున్న‌ది. భౌతిక దాడుల ద్వారా ప్ర‌తిప‌క్షాల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేయాల‌ని ప్ర‌శ్నించ‌కుండా చేయాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు. గ‌తంలో ఇలాంటి సంస్కృతి తెలంగాణ‌లో ఎప్పుడూ లేదు. రాయ‌ల‌సీమ త‌ర‌హా ఫ్యాక్ష‌నిస్టు సంస్కృతిని తెలంగాణ‌లో తెచ్చి రేవంత్ రెడ్డి లా అండ్ ఆర్డ‌ర్‌ను కుప్ప‌కూలుస్తున్న‌డు. ఈ సంస్కృతిని తెలంగాణ స‌మాజం, తెలంగాణ ప్ర‌జ‌లు హ‌ర్షించ‌రు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ త‌గిన మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌దని హ‌రీశ్‌రావు హెచ్చ‌రించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com