సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విషయంలో తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది పాదూరి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరో అల్లు అర్జున్ వెనుక ఒక మహా శక్తి ఉందని ఆయన అన్నారు. అయితే, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పెద్ద ప్లాన్ వేశారని... ఈ వారం రోజుల్లోనే బీఆర్ఎస్, బీజేపీలు ఆ పని పూర్తి చేయాలనుకుంటున్నాయని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. అల్లు అరవింద్ కుటుంబాన్ని కాపాడేందుకు ప్రతిపక్షాలు ఉన్నాయని... బాధిత కుటుంబానికి అండగా నిలవాల్సింది తెలంగాణ సమాజమేనని అన్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచే వారే నిజమైన తెలంగాణవాదులు అని చెప్పారు. సినీ పరిశ్రమకు అండగా నిలిచిన వాళ్లు తెలంగాణ ద్రోహులుగా నిలిచిపోతారని అన్నారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు తనపై ఎవరైనా ఎలాంటి కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని చెప్పారు.