మంగళవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి గచ్చిబౌలిలోని కమిషనరేట్ కార్యాలయంలో 2024 వార్షిక నివేదికను విడుదల చేశారు. సాధారణ నేరాల్లో 64 శాతం పెరుగదల కనిపించగా, సైబర్‌నేరాల్లో 164 శాతం పెరిగాయి. డ్రగ్స్ నియంత్రణపై ఉక్కుపాదం మోపుతున్నామని సీపీ వెల్లడించారు. ఇందులో భాగంగా భారీ ఎత్తున ఈ సారి డ్రగ్స్‌ను అడ్డుకున్నామని తెలిపారు. ప్రధానంగా గంజాయి, కొకైన్, ఓపీఎం, సింథటిక్ డ్రగ్‌ను పట్టుకున్నామని వెల్లడించారు. ఈ ఏడాది 2714 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోగా, వాటి విలువ రూ. 24.92 కోట్లు ఉంటుందని తెలిపారు. పీడీఎస్ రైస్ పక్కదారి పట్టిస్తుండటంతో 135 కేసులు నమోదు చేసి రూ. 178 కోట్ల విలువైన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోయిన సెల్‌ఫోన్లకు సంబంధించి 69554 ఐఎంఈఐఎస్ బ్లాక్ చేసి 7967 సెల్‌ఫోన్లు బాధితులకు అందించినట్లు వివరించారు. నేరాల్లో శిక్షల శాతం గత ఏడాది 43.84 శాతం ఉండగా, ఈ ఏడాది 47.62 శాతం ఉందని సీపీ వివరించారు.
సైబరాబాద్‌లో వచ్చే ఏడాది నుంచి సైబర్ మోసాల్లో రూ. 1.5 లక్షల వరకు ఆర్థిక నష్టం జరిగితే స్థానిక పోలీస్‌స్టేషన్లలోనే కేసులు నమోదు చేస్తామని సీపీ అవినాశ్ మహంతి వెల్లడించారు. ఇప్పటి వరకు రూ. 50 వేలపై ఆర్థిక నష్టం జరిగితే సైబర్‌క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసే వారని, సైబర్ క్రైమ్ ఠాణాపై భారం పడుతుండడంతో నష్ట పరిధిని పెంచుతున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాలు తగ్గాయని, చాలా చోట్ల రోడ్లు విస్తరణ చేయడంతో ప్రమాదాల్లో మరణాలు తగ్గాయని వివరించారు.