ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 05, 2025, 08:52 PM

-  తెలంగాణలో అసమగ్రంగా జరిగిన కులగణనపై... పార్లమెంట్ ను తప్పుదోవ పట్టిస్తారా?
- అసెంబ్లీ సాక్షిగా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదని తేలిపోయింది
- కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రాసిన లేఖలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం
-  బీసీల జనాభాను తగ్గించి వెనకబడిన వర్గాలకు దారుణంగా వెన్నుపోటు పొడిచారు
-  తప్పుల తడకగా తీసిన లెక్కలతో సర్వే పూర్తయిందనడం ముమ్మాటికీ మోసం చేయడమే..
-  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీ కూడా గ్యారెంటీల గారడీలానే మారిపోయిందని మండిపాటు
-  కాంగ్రెస్ సర్కారు యూటర్న్  తీసుకోవడంతో.. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ బూటకమని తేలిపోయిందని ఫైర్
-  నమ్మంచి మోసం చేసినందుకు తెలంగాణలోని బీసీలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్
- స్థానిక ఎన్నికల్లోనే కాదు.. ఇక ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ సమాజం నమ్మదని స్పష్టీకరణ
లక్షలాది మంది వివరాలు సేకరించకుండానే కులగణన సర్వేను తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు పూర్తిచేసిందని రాహుల్ గాంధీ  లోక్ సభలో పేర్కొనడం పార్లమెంటును తప్పుదోవ పట్టించడమేనని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పదేళ్ల క్రితం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన  సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల సంఖ్య 1 కోటి 85 లక్షలుగా తేలిందని, రాష్ట్ర  జనాభాలో ఇది 51 శాతంగా వచ్చిందని గుర్తుచేశారు. ఇక మైనారిటీల్లో ఉన్న బీసీలను కూడా కలిపితే బీసీల సంఖ్య ఏకంగా 61 శాతానికి చేరిందని స్పష్టంచేశారు. అలాంటిది పదేళ్ల తరువాత కాంగ్రెస్ సర్కారు కులగణన సర్వేలో బీసీల జనాభా 1 కోటి 64 లక్షలకు ఎలా తగ్గిందని, 46 శాతానికి ఎలా పడిపోయిందో చెప్పాలని రాహుల్ గాంధీని కేటిఆర్ సూటిగా ప్రశ్నించారు.ఈ మేరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. గత దశాబ్దకాలంలో  బలహీన వర్గాల జనాభా తగ్గినట్టు చూపిన ఈ తప్పుడు లెక్కలను ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని కేటీఆర్ స్పష్టంచేశారు. అసమగ్రంగా జరిగిన సర్వే  పూర్తై పోయినట్టు సాక్షాత్తూ దేశ అత్యున్నత చట్టసభలో  రాహుల్ పేర్కొనడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల సాక్షిగా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో  బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేనే లేదని తేలిపోయిందని కేటిఆర్ స్పష్టంచేశారు. 
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కి, చివరికి కాంగ్రెస్ పార్టీపరంగా మాత్రమే సీట్లు ఇస్తామని చేతులెత్తేయడం మోసం కాకపోతే మరేంటని రాహుల్ గాంధీని కేటీఆర్ నిలదీశారు. కాంగ్రెస్ చేసిన ఈ ద్రోహాన్ని చూస్తూ ఊరుకోవడానికి తెలంగాణలోని బీసీ సమాజం సిద్దంగా లేదని స్పష్టంచేశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే బీసీ రిజర్వేషన్లు పెంచుతామని మీరిచ్చిన మాటను ఏడాది టైమ్ లోనే మంటగలిపి బీసీల గొంతు కోశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల్లో లబ్ది పొందడమే ఏకైక లక్ష్యంగా అబద్ధాలు ప్రచారం చేసి డిక్లరేషన్ లకు ఘోరీ కట్టిన పాపం కాంగ్రెస్ ను వెంటాడటం ఖాయమని కేటీఆర్ తేల్చిచెప్పారు.


తెలంగాణలో అమలుచేయని హామీలను, ఇక్కడి ప్రజలకు అందిస్తున్నట్టు ఎలా ప్రచారం చేసుకుంటారని రాహుల్ గాంధీని కేటిఆర్ నిలదీశారు. ఈ కులగణన సర్వేను కూడా ఇతర రాష్ట్రాల్లో  వాడుకోవాలనే ఎత్తుగడలో భాగంగానే పార్లమెంట్ లో  దీని ప్రస్థావన తెచ్చారని మండిపడ్డారు. కులగణనలో దొర్లిన దారుణమైన తప్పులను సవరించాల్సిన బాధ్యతను మరిచి బంతిని కేంద్రం పరిధిలోకి నెట్టి చేతులు దులుపుకోవాలని చూస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణలోని బీసీ సంఘాల నేతలు ఏకంగా కులగణన నివేదికను చించివేసి నిరసన తెలిపారని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన అంతా తప్పుల తడక అని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకేం కావాలని స్పష్టంచేశారు.  ఈ సర్వేతో బీసీలకు న్యాయం జరగకపోగా కాంగ్రెస్ సర్కారు తీవ్రమైన అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. పదేళ్లలో అగ్రవర్ణాల జనాభా పెరిగి.. బీసీల జనాభా తగ్గడం.. ఎలా సాధ్యమో చెప్పగలరా అని రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నించారు.


వెనకబడిన వర్గాల భవిష్యత్తును నిర్దేశించే కీలకమైన కోటాను తప్పుల కుప్పగా తయారుచేయడం, కాంగ్రెస్ పార్టీకి బీసీలపట్ల ఉన్న నిలువెత్తు నిర్లక్ష్యానికి అద్దంపడుతోందని  ఆగ్రహం వ్యక్తంచేశారు. కులగణనలో  చూపిన ఈ తప్పుడు లెక్కల వల్ల రానున్న రోజుల్లో ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని బీసీ బిడ్డలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, వాస్తవాలు తెలుసుకోకుండా రాహుల్ గాంధీ మాట్లాడటం దారుణమన్నారు. తెలంగాణలో బీసీలకు తీవ్ర అన్యాయం చేసే ఈ ఫెయిల్యూర్ మోడల్ ను దేశవ్యాప్తంగా అమలుచేయాలని రాహుల్ కోరడం మరో విడ్డూరమని వ్యాఖ్యానించారు.ఎన్నికల ముందు ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడే కాంగ్రెస్ నిజస్వరూపం ఏడాది కాలంగా అనేక రూపాల్లో బయటపడిందని, బీసీల జనాభాను తగ్గించి చారిత్రక తప్పిదం చేసిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణలోని వెనకబడిన వర్గాలు ఎప్పటికీ క్షమించవని కేటిఆర్ తేల్చిచెప్పారు. గ్యారెంటీల పేరిట చేసిన గారడీని, డిక్లరేషన్ పేరిట చేసిన ఈ దగాను చూసిన తరువాత  వచ్చే స్థానిక ఎన్నికల్లోనే కాదు.. ఏ ఎన్నికల్లోనూ ఇక కాంగ్రెస్ పార్టీని ప్రజలను నమ్మరని కేటీఆర్ కుండబద్దలు కొట్టారు. అసెంబ్లీ వేదికగా బీసీ డిక్లరేషన్ ఓ నాటకమని, బీసీలకు స్థానిక ఎన్నికల్లో కల్పిస్తామన్న 42 శాతం రిజర్వేషన్ల హామీ బూటకమని తేలిపోయిన నేపథ్యంలో..  తెలంగాణలోని బీసీలకు రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటిఆర్ డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com