ఎప్పటినుండో దేశంలో జనగణనతో పాటు కులగణన కూడా జరగాలన్న డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. 2015 లో కర్ణాటక కులగణన వైపు అడుగులు వేస్తే తర్వాత 2023 లో వివాదాల నడుమ బీహార్ కూడా కులగణన పూర్తి చేసింది. ఆ తర్వాత ఈ కుల గణన ఇంకెక్కడా జరగలేదు. రాహుల్ గాంధీ పదేపదే ఈ అంశాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. మొత్తానికి ఇప్పుడు తెలంగాణ కూడా సర్కార్ సమగ్ర కుటుంబ సర్వే పేరుతో కుల గణన కూడా పూర్తి చేసింది. అందులో భాగంగా బీసిల శాతాన్ని 46 శాతంగా తేల్చింది. కానీ ఈ నిర్ణయంపై బిసి నేతలు ఆమోదం తెలపలేదు అలాగే సంతోషంగా కూడా లేరు, పైపెచ్చు విమర్శిస్తున్నారు. అసలు గణన చేయకపోయినా మాములుగానే బిసిల జనాభా యాభై శాతం పైనే ఉంటుందని, ఈ కుల గణన అశాస్త్రీయమైనదని, తమకు అన్యాయం జరిగిందనే బిసీ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఎన్ టి రామారావు అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు రిజర్వేషన్లు మొదటిసారి ప్రవేశపెట్టారు. మొదట్లో అది 20 శాతం ఉంటే, తర్వాత కోట్ల విజయ భాస్కర్ రెడ్డి నాయకత్వంలో 34 శాతానికి పెరిగితే, 2019 లో బి ఆర్ ఎస్ ప్రభుత్వం దాన్ని 22 శాతానికి కుదించింది. 2018 నుండి కాంగ్రెస్ కులగణనకు సానుకూల స్వరాన్నే వినిపిస్తూ ఉంది. 2018 లో బిసి కులగణన చేస్తామని కాంగ్రెస్ తమ మేనిఫెస్టో లో ప్రకటించింది కూడా. 2023 తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో బిసి డిక్లరేషన్ సభ పెట్టి, స్థానిక సంస్థల్లో వారికి 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని భరోసా ఇచ్చింది. ఇప్పుడు మొత్తానికి తెలంగాణలో గత ప్రభుత్వం అధికారంలో బిసి రిజర్వేషన్ శాతం తగ్గడంతో కొత్త ప్రభుత్వం తప్పక తమకు న్యాయం చేస్తుందని బిసిలు ఎదురు చూసారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని ధీమాగా చెప్తున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ, ‘చట్టపరంగా బిసిలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి’ అన్నారు. ఇది నిజంగా సాధ్యమయ్యే విషయమేనా? ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రాన్ని ఒప్పించి రాజ్యాంగ సవరణను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురాగలదా? లేకపోతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ ఈ విషయాన్నీ వెనక్కి నేట్టేస్తారా? ఇవన్ని తేలాల్సిన విషయాలు.
ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వస్తే ఎస్సి ఎస్టిలకు రిజర్వేషన్లు దామాషా పద్ధతి ప్రకారం రాజ్యంగబద్ధంగా కల్పిస్తున్నారు. కాని బిసిలకు మాత్రం ఆయా ప్రభుత్వాలే రిజర్వేషన్లు ప్రకటిస్తున్నాయి. ప్రభుత్వాలు ప్రకటించే రిజర్వేషన్ల గురించి ఎప్పుడు వివాదాలు, న్యాయ పరమైన అంశాలు తలెత్తడం కూడా ఒక పరిపాటిగా మారిపోయింది. ఈ రిజర్వేషన్ల పై ఒక కేసు సందర్భంలో సుప్రీమ్ కోర్టు కొన్ని మార్గదర్శకాలు కూడా ఇచ్చింది. అందులో ఒక మార్గదర్శకం ప్రకారం ప్రతి స్థానిక సంస్థలో ఓబిసి రిజర్వేషన్ల అమలు, ఫలితాలపై అధ్యయనం చేయడానికి ఒక డెడికేషన్ కమిటిని ఏర్పాటు చేయాలి. రెండవ దాని ప్రకారం జనాభా నిష్పత్తిని అనుసరించి ఈ రిజర్వేషన్లు నిర్ణయించాలి. మూడోది మొత్తం ఎస్సి,ఎస్టి, ఓబిసి మొత్తం కలిపి 50 శాతానికి మించకూడదు. ఈ నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడా రిజర్వేషన్లు అమలు చేయకూడదని కూడా సుప్రీమ్ కోర్టు స్పష్టం చేసింది. సుప్రీమ్ కోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన గుజరాత్,మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రద్దు చేసింది.
ఈ సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి చేస్తే బిసిలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం దాదాపు అసాధ్యమైన విషయమనే చెప్పుకోవచ్చు. అందులొనూ ఇప్పుడు జరిగిన కులగణనలో బిసి జనాభానే 46 శాతంగా ప్రభుత్వం తెల్చినప్పుడు, ఇక మొత్తం ఎస్సి,ఎస్టి, ఓబిసి మొత్తం కలిపి 50 శాతం మించకూడదన్న మార్గదర్శకాన్ని అనుసరించి ఈ 42 శాతం అమలు చేయడం సుప్రీం కోర్టు మార్గదర్శ ఉల్లంఘనే అవుతుంది. ఇంకో వైపు బిసి నాయకులు ఈ కుల గణన అన్నది కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమకు అనుకూలంగా ప్రభుత్వం అడ్జస్ట్ చేసి చేసినట్టు ఉందే తప్ప అసలు లెక్కలు లేవని ఆరోపిస్తున్నారు. అలాగే తెలంగాణా జనాభా 4 కోట్ల పది లక్షలు ఉంటె, ఈ నివేదికలో మాత్రం అది 3 కోట్ల 54 లక్షలుగా చెప్పారని ఎనలిస్ట్ శేషు పేర్కొన్నారు ఒక న్యూస్ డిబేట్ లో. ఇలా ఏ లెక్కన చూసినా ఈ బిసి కుల గణనను ప్రభుత్వం చేసినప్పటికీ ఊహించిన సానుకూల స్పందన మాత్రం బిసి వర్గం నుండి రాలేదు. నిరసనలు మాత్రమె వెల్లువెత్తుతున్నాయి.
కాంగ్రెస్ ఎమ్మెల్సిగా ఉన్న తీన్మార్ మల్లన్న, ‘బిసిలను ఇంకా అణగద్రొక్కడానికి చేసిన ఒక కుట్ర ఈ నివేదిక. ఈ నివేదికను నేను ఎప్పుడు అంగీకరించను’ అని గట్టిగా అనడమే కాకుండా ఆ కుల గణన నివేదికను బహిరంగంగా కాల్చేసాడు. బిసి నాయకుల్లో ఎవరూ కూడా ఈ కుల గణనను ఆహ్వానించిన దాఖలాలు లేవు. మొత్తం మీద తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుల గణన ఊహించిన స్థాయి సానుకులతను సొంతం చేసుకోలేకపోయింది. ఇక బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అన్నది ప్రస్తుతానికి దూరమైన లక్ష్యంలాగానే అనిపిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa