ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వివాదాలు పరిష్కరించండి...ప్రభుత్వానికి ఎమ్మార్ ప్రాపర్టీస్ విజ్ఞప్తి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 27, 2025, 09:08 PM

హైదరాబాద్, సూర్య న్యూస్ నెట్ వర్క్ :తెలంగాణలో వివిధ ప్రాజెక్టులపై సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించిన వివాదాలను పరిష్కరించాలని ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దుబాయ్‌కి చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్ ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో సమావేశమై వివిధ ప్రాజెక్టులపై నెలకొన్న వివాదాలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.


2001 లో ఉమ్మడి రాష్ట్రంలో దుబాయ్‌కి చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్ హైదరాబాద్‌లో కన్వెన్షన్ సెంటర్, హోటల్, గోల్ఫ్ కోర్సు, విల్లాల నిర్మాణం తదితర ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు అప్పటి ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంది. ఆనాటి ఏపీఐఐసీతో ఆ సంస్థ చేసుకున్న ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని అప్పట్లో సీబీఐ, ఈడీ కేసులు నమోదయ్యాయి. ఏజెన్సీల దర్యాప్తులు, కోర్టుల్లో విచారణలు కొనసాగుతున్నాయి.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015 అక్టోబర్‌లో అప్పటి ప్రభుత్వం ఎమ్మార్ సంస్థకు సంబంధించిన ప్రాజెక్టుల వివాదాల పరిష్కారానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సారధ్యంలో అయిదుగురు కార్యదర్శుల స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు కేంద్ర విదేశాంగ శాఖ, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.


ఎమ్మార్ ప్రతినిధులతో జరిగిన తాజా చర్చల సందర్భంగా ఈ వివరాలన్నింటినీ అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. వివిధ దర్యాప్తు ఏజెన్సీల కేసులు, ఛార్జీషీట్లు, న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్నందున ఎమ్మార్ ఒప్పందాల డాక్యుమెంట్లు, కోర్టు కేసుల వివరాలతో పాటు కేంద్ర ప్రభుత్వ సూచనలన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.


ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారాన్ని పరిష్కరించేందుకు 2015 లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఆనాటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి అదనంగా న్యాయ నిపుణులతో కూడిన మరో కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.


న్యాయ వివాదాలను అధ్యయనం చేయడానికి, సామరస్య పూర్వక పరిష్కారం చేసుకోవడానికి యూఏఈ ప్రభుత్వ ఆమోదంతో ఒక లీగల్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని సంస్థ ప్రతినిధులు చేసిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి అమోదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ ఆ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి తదుపరి సూచనలు, సలహాలు అందిస్తుందని చెప్పారు.


ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ అలీ రషీద్ అలబ్బర్ నేతృత్వంలో భారత్‌లో యూఏఈ మాజీ రాయబారి డాక్టర్ అహ్మద్ అల్ బన్నా , ఎమ్మార్ గ్రూప్ సీఈవో అమిత్ జైన్, ఆ కంపెనీ ఇంటర్నేషనల్ అఫైర్స్ హెడ్ ముస్తఫా అక్రమ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.


ముఖ్యమంత్రి తో జరిగిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa