భర్త, అత్తింటి వేధింపులు తాళలేక ఓ నవ వధువు భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోలక్‌పూర్‌లో గురువారం చోటు చేసుకుంది.పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భోలక్‌పూర్‌కు చెందిన సౌజన్యకు మూసాపేటకు చెందిన జిమ్ నిర్వాకుడు శబరీష్ యాదవ్‌తో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది.అయితే, సౌజన్యకు గుండెలో రంధ్రం ఉందని, చెప్పకుండా పెళ్లి చేశారని ఆమె భర్త, అతడి కుటుంబ సభ్యులు సౌజన్యను తరచూ వేధిస్తున్నారు. ఈ విషయం దాచినందుకు అదనపు కట్నం తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నారు. పలుమార్లు ఆమెను పుట్టింటికి పంపారు. బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి అత్తింటికి వెళ్లిన సౌజన్యను తమ ఇంటికి రావొద్దంటూ అక్కడినుంచి వెల్లగొట్టారు.దీంతో మనస్తాపం చెందిన సౌజన్య పుట్టింటికి వచ్చి మూడంతస్తుల భవనం పైనుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించగా కొద్దిసేపటికి మృతి చెందినట్లు ముషీరాబాద్ పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి పుష్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
![]() |
![]() |