వక్ఫ్ చట్ట సవరణ బిల్లు-2025ను కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో నేడు ప్రవేశపెట్టింది. ఈ కీలక బిల్లుపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సభలో చర్చకు అనుమతించారు. విపక్ష సభ్యుల అభ్యంతరాలు... కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీటైన సమాధానాలు... లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా రూలింగ్స్ తో చర్చ వాడీవేడిగా సాగుతోంది.చర్చ సందర్భంగా రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీకి చెందిన ఎన్.కె. ప్రేమచందన్ ఒక పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తుతూ, ఇక్కడ (లోక్ సభలో) ఒరిజినల్ బిల్లుపై చర్చించడం లేదని ఆక్షేపించారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి బిల్లులో కొత్త నిబంధనలను చేర్చే అధికారం ఉందా? అని ప్రశ్నించారు.రూల్ 81ని సస్పెండ్ చేయకపోతే లోక్‌సభకు కూడా కొత్త నిబంధనలను చేర్చే అధికారం లేదని ఆయన వాదించారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ సవరణలను సిఫార్సు చేయగలదు కానీ నేరుగా కొత్త నిబంధనలను చేర్చలేదని ప్రేమచందన్ స్పష్టం చేశారు.దీనికి సమాధానంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోక్యం చేసుకుంటూ, ప్రతిపక్షాల డిమాండ్ మేరకే బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపామని గుర్తు చేశారు. కమిటీ తన అభిప్రాయాలను తెలియజేసిందని, వాటిని క్యాబినెట్ సమీక్షించి ఆమోదించిందని చెప్పారు.ప్రతిపక్షాల అభ్యర్థన మేరకు ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అభిప్రాయాలు చెప్పే అధికారం లేకపోతే దాని ఉనికి అర్థరహితం అవుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాదిరిగా కమిటీలు రబ్బర్ స్టాంపులు కాదని, మార్పులను అంగీకరించకపోతే కమిటీకి అర్థం లేదని షా వ్యాఖ్యానించారు.
![]() |
![]() |