ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరిశోధనల్లో భారత్ మరో అద్భుతం..చంద్రుడిపై నివాసాలకు బ్యాక్టీరియా ఇటుకలు సృష్టి!

Technology |  Suryaa Desk  | Published : Fri, Apr 04, 2025, 10:32 PM

చంద్రుడిపై నివాసాలు నిర్మించడానికి శాస్త్రవేత్తలు, అంతరిక్ష సంస్థలు ముమ్మరంగా పరిశోధనలు చేస్తున్నాయి. ఇది సవాళ్లతో కూడుకున్నదే అయినా.. అధునాతన సాంకేతికత, నూతన ఆవిష్కరణలు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నాయి. అయితే, చంద్రుడిపై వాయుమండలం లేకపోవడం వల్ల రేడియేషన్‌ను తట్టుకుని, పీడనాన్ని తట్టుకునేలా భవనాలను నిర్మించాల్సి ఉంటుంది. అంతేకాదు, ఇక్కడ నుంచి సిమెంట్, ఇసుక, ఇటుకలు వంటి మెటీరియల్‌ను అక్కడకు తరలించడం చాలా ఖర్చు, కష్టంతో కూడుకున్నది. అందుకే జాబిల్లిపై మట్టితో ఇటుకలను తయారుచేసే దిశగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ విషయంలో భారతీయ శాస్త్రవేత్తలు కీలక పురోగతి సాధించారు.


బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కు చెందిన పరిశోధకులు ఒక కొత్త విధానాన్ని ఆవిష్కరించారు. చంద్రునిపై లభించే మట్టితో ఇటుకలు తయారుచేసి, వాటికి బ్యాక్టీరియాను ఉపయోగించి పగుళ్లు రాకుండా చేసే పద్ధతిని అభివృద్ధి చేశారు. ఈ పరిశోధన ఫలితాలు 'ఫ్రాంటియర్స్‌ ఇన్‌ స్పేస్‌ టెక్నాలజీస్‌' అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ నమూనాలను ఇస్రో చేపట్టబోయే తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌లో పంపనున్నారు.


చంద్రునిపై వాతావరణం చాలా కఠినంగా ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రతలు విపరీతంగా మారుతుంటాయి. ఒకరోజు 121 డిగ్రీల సెల్సియస్‌ వరకు వేడి, మైనస్‌ 133 డిగ్రీల సెల్సియస్‌ వరకు చలి ఉంటుంది. అంతేకాకుండా సౌరగాలులు, తోకచుక్కల ప్రభావం కూడా ఎక్కువే. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ ఇటుకలను ఉపయోగించలేం. ఈ సమస్యను పరిష్కరించడానికి ఐఐఎస్సీ పరిశోధకులు ఒక ప్రత్యేకమైన బ్యాక్టీరియాను ఉపయోగించారు.


ఏంటీ బ్యాక్టీరియా ఇటుకలు


‘స్పోరోసార్సినా పాశ్చరీ’ అనే బ్యాక్టీరియాను ఇటుకల తయారీలో వాడటం వల్ల, అధిక ఉష్ణోగ్రతలతో పగుళ్లు రాకుండా నివారించవచ్చని గుర్తించారు. బ్యాక్టీరియా ద్రావణం, గోరుచిక్కుడు మొక్కల జిగురు, చంద్రునిపై ఉండే మట్టి లాంటి పదార్థాన్ని కలిపి ఇటుకలు తయారు చేశారు. ఈ ప్రక్రియలో బ్యాక్టీరియా, ఇటుకలలోని కార్బొనేట్‌ను కాల్షియం కార్బొనేట్‌గా మారుస్తుంది. ఇది గోరుచిక్కుడు జిగురుతో కలిసి ఇటుకలకు గట్టిదనాన్ని ఇస్తుంది. దీనివల్ల ఇటుకలు 100 నుంచి 175 డిగ్రీల సెల్సియస్‌ వరకు తట్టుకోగలవని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ విధానం చంద్రునిపై భవనాలు నిర్మించడానికి కీలక ముందడుగు అవుతుంది.


అయితే, జాబిల్లిపై శాశ్వత నివాసాల నిర్మాణం కోసం అమెరికా, చైనా, రష్యా, ఐరోపా సమాఖ్యతో పాటు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం పలు పరిశోధనలు సాగుతున్నాయి. త్రీడి ప్రింటింగ్, గస్-బేస్డ్ హౌసింగ్, లావా ట్యూబ్‌లు, ఫోల్డబుల్ మాడ్యూల్స్ వంటి నిర్మాణాలపై దృష్టి పెట్టాయి.


త్రీడీ ప్రింటింగ్


కాగా, చంద్రుడిపై నిర్మాణాల కోసం ఇప్పటికే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈసా త్రీడి ప్రింటింగ్‌ విధానంలో ప్రయత్నిస్తున్నాయి. ఈ విధానంలో జాబిల్లి ఉపరితలంపై మట్టిని ఉపయోగించి భవనాలను ప్రింట్ చేస్తారు. ఇందుకోసం చంద్రుడిపై మట్టిని వేడిచేసి, ఇటుకలుగా మార్చుతారు. ఆర్టిమిస్ ద్వారా నాసా-ఇస్రో కలిసి పనిచేయనున్నాయి.


గస్-బేస్డ్ హౌసింగ్


బ్యాక్టీరియా, శిలీంద్రాల సహాయంతో స్వయం పెరిగే నిర్మాణాలపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. దీనిపై బయో హ్యాబిటెట్ ప్రాజెక్ట్ ద్వారా నాసా పరిశోధన చేస్తోంది. గాలిని నింపి గుడారాలు మాదిరిగా విస్తరించేలా చేస్తారు. ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులను తట్టుకునేలా ఉంటాయని భావిస్తున్నారు.


లావా ట్యూబ్‌లు


చంద్రునిపై ప్రకృతి సిద్ధమైన లావా గుహలు ఉన్నాయి. ఇవి అగ్ని పర్వత కార్యకలాపాల కారణంగా ఏర్పడిన ప్రకృతి సిద్ధమైన భూగర్భ గుహలు. చంద్రుని ఉపరితలం కిందన భారీ సొరంగాలుగా ఉంటాయి. వీటిని నివాస స్థలాలుగా మార్చడం సులభం. ఎందుకంటే ఇవి రేడియేషన్, ఉల్కల నుంచి రక్షణ కలిగిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


ఫోల్డబుల్ మాడ్యూల్స్


భూమిపై పోల్డబుల్ హౌస్‌లను నిర్మించి.. చంద్రునిపైకి చేర్చడం. భూమి నుంచి సులభంగా రవాణా చేసి, అక్కడ విస్తరించగలిగే ప్రత్యేకమైన నివాస నిర్మాణాలు. ఈ విధాన్నాన్ని చంద్రునిపై లేదా అంగారక గ్రహాలపై స్థిర నివాసాలకు పరిష్కారంగా పరిగణిస్తున్నారు. అంతరిక్షంలో భద్రంగా రవాణా చేయగలిగి, తక్కువ బరువుతో కూడిన సులభంగా విస్తరించగలిగే నివాసాలు. చంద్రునిపై దిగిన తర్వాత, విస్తరించే విధంగా రూపొందిస్తారు. రేడియేషన్, ఉల్కల ప్రభావం, తక్కువ గురుత్వాకర్షణ ప్రభావం వంటి సమస్యల నుంచి రక్షణ పొందేలా ఉంటాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com