నెలకి కేవలం రూ.15 వేలు జీతం తీసుకునే ఓ సాధారణ పారిశుద్ధ్య కార్మికుడికి ఏకంగా రూ.34 కోట్ల పన్ను కట్టాలంటూ ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. దీంతో షాక్ తిన్న ఆ కార్మికుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే.. ఆగ్రాకు చెందిన కరణ్ సింగ్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ సంస్థలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు అందాయి. అందులోని పన్ను బకాయి వివరాలు చూసిన కరణ్ సింగ్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు."నేను నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తిని. నెలకు రూ.15 వేలు మాత్రమే సంపాదిస్తాను. నాకు రూ.34 కోట్ల పన్ను నోటీసు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. ఎవరో నా పాన్ కార్డును దుర్వినియోగం చేశారు. దీనిపై విచారణ జరిపి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను" అని కరణ్ సింగ్ పోలీసుల ముందు వాపోయాడు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కరణ్ సింగ్ పాన్ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేశారా? లేదా ఆదాయపు పన్ను శాఖ అధికారుల తప్పిదం వల్ల జరిగిందా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలు గతంలోనూ వెలుగులోకి రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తమ వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
![]() |
![]() |