సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ లోక్ సభలో వక్ఫ్ బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ బిల్లు ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమని అభివర్ణించారు. ఎన్డీయే సర్కారు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి వక్ఫ బిల్లును ఒక ముసుగులా వాడుకుంటోందని అన్నారు. 'యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్' వంటి పదాల సమన్వయాన్ని ఆయన ప్రశ్నించారు. బిల్లు అర్థరహితంగా ఉందని.ఈ బిల్లు సారాంశం ఆంగ్లంలో ఉన్నా ఒకటే, హిందీలో ఉన్నా ఒకటే అని విమర్శించారు. మహా కుంభమేళాలో హిందువుల మరణాల నుంచి దృష్టి మరల్చేందుకే వక్ఫ్ భూముల అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారువక్ఫ్ భూముల దాకా ఎందుకు రక్షణ, రైల్వే భూములను అమ్మకుండా కాపాడగలరా అని సవాల్ చేశారు. వక్ఫ్ భూముల కంటే చైనా గ్రామాలు నిర్మించిన మన భూభాగం గురించే ప్రధానంగా ఆందోళన కలుగుతోందని అన్నారు. ఈ అంశంపై ప్రశ్నలను అణచివేసేందుకే వక్ఫ్ బిల్లును రూపొందించిందని ఆరోపించారు. చైనా ఎన్ని గ్రామాలు నిర్మించిందో వెల్లడించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కొత్త చట్టాలతో ప్రజల దృష్టిని మరల్చవద్దని హితవు పలికారు. ఈ క్రమంలో అఖిలేశ్ యాదవ్ అమిత్ షా, కిరణ్ రిజిజు వంటి కేంద్రమంత్రులపై విమర్శలు చేశారు. బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అని చెప్పుకుంటున్నా, అంతర్గత నాయకత్వ వివాదాల్లో చిక్కుకుందని, పార్టీ అధ్యక్షుడిని నిర్ణయించలేకపోతోందని అఖిలేశ్ ఆరోపించారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఎన్ని మంది మహిళా అభ్యర్థులను నిలబెడుతుందో చెప్పాలని ప్రశ్నించారు. ఈ దశలో స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకున్నారు. కేవలం వక్ఫ్ బిల్లుపై చర్చించాలని కోరారు.
![]() |
![]() |