మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడను బీజేపీ లోక్‌సభ సభ్యుడు తేజస్వీ సూర్య ప్రశంసించారు. వక్ఫ్ సవరణ బిల్లుపై 17 గంటలకు పైగా జరిగిన చర్చలో 91 ఏళ్ల దేవెగౌడ ఉత్సాహంగా పాల్గొనడం తమకు స్ఫూర్తిదాయకమని ఆయన 'ఎక్స్' వేదికగా కొనియాడారు. వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 పార్లమెంటు ఆమోదం పొందింది. గురువారం మధ్యాహ్నం ప్రారంభమైన చర్చ అర్ధరాత్రి దాటినా కొనసాగింది. ఈ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో దేవెగౌడ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో తేజస్వీ సూర్య స్పందిస్తూ, ప్రజల సమస్యలను వినిపించడానికి వారి తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్లమెంటు సమావేశాలకు హాజరుకాకుండా తప్పించుకునే వారు ఉన్నారని అన్నారు. సమావేశాలకు అంతరాయం కలిగించేవారు, గందరగోళం సృష్టించేవారు కూడా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అలాంటి వారంతా దేవెగౌడను చూసి సభలో ఎలా వ్యవహరించాలో నేర్చుకోవాలని సూచించారు.
![]() |
![]() |