అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంతిల్లు నిర్మించుకోనున్నారు. రేపు (ఏప్రిల్ 9) శంకుస్థాపన జరగనుంది. రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు నివాసం ఏర్పాటు చేసుకోవడం పట్ల ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.వెలగుపూడి సచివాలయం వెనుక, ఈ9 రహదారి పక్కన కొంత భూమిని కొనుగోలు చేసిన చంద్రబాబు, బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి గృహ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. 2014లో రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాత, చంద్రబాబు నాయుడు పాలనను ఇక్కడి నుంచే కొనసాగించారు. అయితే, రాజధాని నిర్మాణంపైనే దృష్టి సారించిన ఆయన సొంతిల్లు నిర్మాణం గురించి పెద్దగా పట్టించుకోలేదు.2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, అమరావతిని దేశంలోనే అగ్రగామి రాజధానిగా తీర్చిదిద్దేందుకు కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ క్రమంలోనే నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించి, నిర్మాణాలను వేగవంతం చేశారు. ఇప్పుడు సొంతిల్లు నిర్మాణం చేపట్టడం ద్వారా ప్రజలకు భరోసా కల్పించనున్నారు.చంద్రబాబు సొంతిల్లు కట్టుకుంటుండటంతో రాజధాని రైతుల్లోనూ నమ్మకం పెరిగింది. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు గత ప్రభుత్వ హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు చంద్రబాబు స్వయంగా ఇల్లు నిర్మించుకుంటుండడంతో తమకు మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నారు.రాజధాని ఎంపిక నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యానికి చంద్రబాబు ప్రాధాన్యతనిచ్చారు. అమరావతిపై కుట్రలు జరిగినప్పుడు రాజధాని రైతులకు అండగా నిలిచారు. ఇప్పుడు ఆయన స్వయంగా ఇల్లు నిర్మించడంతో రాజధాని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర నిధులు, ప్రముఖ సంస్థల ఏర్పాటు, వేగంగా జరుగుతున్న నిర్మాణ పనులతో అమరావతి ప్రాంతంలో సానుకూల వాతావరణం నెలకొంది. చంద్రబాబు నివాస పనులతో అమరావతికి కొత్త శోభ వస్తుందని ప్రజలు భావిస్తున్నారు.
![]() |
![]() |