సీఎం చంద్రబాబునాయుడు చెప్పిన పీ4 విధానానికి రిలయన్స్ సీబీజీ ప్లాంట్స్ నాంది కాబోతున్నాయని, పేదరికం లేకుండా చేయడంలో ఇదొక ముఖ్యమైన అడుగు కాబోతోందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పిసిపల్లి మండలం దివాకరపురంలో రిలయన్స్ సంస్థ ఆధ్వర్యాన ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంటుకు మంత్రి లోకేశ్ బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.... ఎటువంటి నీటివసతి లేని మెట్టప్రాంతంలోని రైతులకు ఈ ప్లాంట్స్ ద్వారా పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది. నైపర్ గడ్డితో గ్యాస్ తయారు చెయ్యబోతున్నారు. ప్రభుత్వ భూములకు 15 వేలు, రైతుల భూములకు రూ. 31 వేలు కౌలు కూడా ఇవ్వబోతున్నారు. రైతులే గడ్డి పెంచి ఇస్తే టన్నుకు నిర్ణీత ధర చెల్లిస్తారు. రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేసే సీబీజీ ప్లాంట్లన్నీ పూర్తిస్థాయిలో పనిచేస్తే ఏటా 110 లక్షల మెట్రిక్ టన్నుల ఆర్గానిక్ ఎరువు కూడా తయారు అవుతుంది. ఈ ప్లాంట్ల ద్వారా గ్రామీణ యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయి. నేను ప్రకాశం జిల్లా వచ్చిన ప్రతీ సారి మీరు చూపించే ప్రేమ, ఆప్యాయత నేను మర్చిపోలేను. ప్రకాశం జిల్లాలో పేదరికం లేకుండా చెయ్యడమే మా లక్ష్యం. రానున్న అయిదేళ్లలో ఆ లక్ష్యాన్ని సాధించి తీరుతాం అని అన్నారు.
![]() |
![]() |