తెలంగాణ పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తన జీవితంలోని కష్టాలను, ప్రజలకు సేవ చేయాలనే తన సంకల్పాన్ని గుర్తు చేసుకున్నారు. తన భర్త కుంజ రాము వర్ధంతి సభలో ప్రసంగిస్తూ, సీతక్క ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. భర్త స్మృతులతో కదిలిపోయారు. కన్నీటిపర్యంతమైన ఆమెను విమలక్క ఓదార్చారు.ఒకప్పుడు ఉద్యమంలో పనిచేస్తున్న సమయంలో ఎన్‌కౌంటర్ నుంచి తృటిలో తప్పించుకున్నానని, అది తనకు పునర్జన్మ అని మంత్రి సీతక్క అన్నారు. ఈ జన్మలో పేదలు, ఆదివాసీలు, అట్టడుగు వర్గాల హక్కుల కోసం తన చివరి శ్వాస వరకు పోరాడతానని ఆమె పేర్కొన్నారు.మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మోకాళ్లపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో, సీతక్క తన కుమారుడు సూర్య, కోడలు కుసుమాంజలితో కలిసి భర్త కుంజ రాము స్తూపం వద్ద నివాళులర్పించారు. రాము 17 ఏళ్ల వయసులోనే ఉద్యమంలో చేరి ఎన్నో పోరాటాలలో పాల్గొన్నారని, ఆయన ఎల్లప్పుడూ అట్టడుగు వర్గాల అభివృద్ధికి పాటుపడ్డారని ఆమె గుర్తు చేసుకున్నారు. రాము నేర్పిన విలువలు, నైతికతతోనే తాను ప్రజల కోసం పనిచేస్తున్నానని సీతక్క అన్నారు.
![]() |
![]() |