అధికారులకు సహకరిస్తూ ఫుట్‌పాత్ వ్యాపారాలు చేసుకోవాలని చిరు వ్యాపారులకు సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. స్ట్రీట్ వెండర్స్ పట్ల అధికారులు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ తమ వైఖరిని మార్చుకోవాలని కోరారు. శుక్రవారం రాంగోపాల్‌పేట డివిజన్‌లోని మినిస్టర్ రోడ్ పీజీ రోడ్డు సింధీ కాలనీలకు చెందిన పలువురు ఫుట్‌పాత్ వ్యాపారులు, స్ట్రీట్ వెండర్స్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో కలిసి వారి సమస్యలను వివరించారు. జీహెచ్‌ఎంసీ అధికారులు తమ వ్యాపారాలకు అనుమతిస్తున్న కూడా ట్రాఫిక్ సమస్యల పేరుతో తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తమకు జీవనాధారం లేకుండా చేస్తే మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఆందోళన వ్యక్తం చేశారు.స్ట్రీట్ వెండర్స్ వినతిపై స్పందించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ట్రాఫిక్ పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వ్యాపారులను ఇబ్బందులకు గురి చేయొద్దని ఆదేశించారు. అంతా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారేనని పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి వివిధ రకాల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వ్యాపారులకు అవసరమైన సూచనలు, జాగ్రత్తలు చెప్పాలి కానీ వ్యాపారాలే చేయకుండా అడ్డుకోవడం సరికాదన్నారు.
![]() |
![]() |