మయన్మార్‌లో సంభవించిన భారీ భూకంపం ప్రపంచ వ్యాప్తంగా అలజడి సృష్టించింది. శుక్రవారం మయన్మార్‌లో చోటు చేసుకున్న భూకంపంతో అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మయన్మార్ తోపాటు సమీపంలోని థాయ్‌లాండ్‌ను తాకాయి ఈ భూ ప్రకపంనలు. దీంతో అక్కడ కూడా పలు భవనాలు నేల కూలడంతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.కాగా, తెలంగాణలోని రామగుండంకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ కుటుంబం థాయ్‌లాండ్ పర్యటనలో ఉండటంతో ఇక్కడి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఎమ్మెల్యే భార్య, ముగ్గురు పిల్లలు కూడా బ్యాంకాక్ పర్యటనకు వెళ్లారు. అయితే, ఎమ్మెల్యే కుటుంబసభ్యులు క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందడంతో బంధువులు, అభిమానులు, అనుచరులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ భూకంపం కారణంగా తమకు ఎలాంటి హానీ జరగలేదని, సురక్షితంగా ఉన్నామని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ కుటుంబం తెలియజేసింది. భూకంపం సమాచారంతో హుటాహుటిన థాయ్‌లాండ్ బయల్దేరారు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్.మయన్మార్, థాయ్ లాండ్‌లలో నిమిషాల వ్యవధిలోనే సంభవించిన వరుస భారీ భూకంపాలతో ఇప్పటి వరకు 100 మందికిపైగా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. మయన్మార్‌లో భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
![]() |
![]() |