రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లాలో ఓ రైతు కుటుంబంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే..... ఎద్దులను అమ్మగా వచ్చిన డబ్బును భర్త ధాన్యం బస్తాలో దాచుకోగా, ఆ విషయం తెలియని భార్య ఆ బస్తాను ఓ వ్యాపారికి విక్రయించింది. తీరా విషయం తెలిశాక లబోదిబోమన్నా ప్రయోజనం లేకపోయింది. స్థానికుల కథనం ప్రకారం.. గణపురం మండలం గాంధీనగర్‌కు చెందిన రైతు పోతరాజు వీరయ్య కొన్ని రోజుల క్రితం తన ఎద్దులను అమ్మాడు. వచ్చిన లక్షన్నర రూపాయల నగదును ఇంట్లోని ఓ ధాన్యం బస్తాలో భద్రపరిచాడు. అయితే, ఈ విషయం భార్యకు చెప్పలేదు. గత బుధవారం విడి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఓ వ్యాపారి వాహనంలో గ్రామానికి వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న వీరయ్య భార్య.. భర్త డబ్బులు దాచిన ఆ ధాన్యం బస్తాను ఇతర ధాన్యంతో పాటు ఆ వ్యాపారికి అమ్మేసింది. పనులన్నీ ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చిన వీరయ్యకు ధాన్యం బస్తా కనిపించకపోవడంతో అనుమానం వచ్చింది.వెంటనే భార్యను ఆరా తీయగా ధాన్యం బస్తాను వ్యాపారికి అమ్మినట్టు ఆమె తెలిపింది. దీంతో వీరయ్య హతాశుడయ్యాడు. వెంటనే ఆ వ్యాపారి కోసం గ్రామంలో గాలించినప్పటికీ అతడి ఆచూకీ లభించలేదు. దీంతో చేసేదేమీ లేక ఆ దంపతులు శనివారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు గణపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. వ్యాపారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa