తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి దశలో ఫైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన గ్రామాల్లో లబ్ధిదారులను గుర్తించి ఇండ్లు మంజూరు చేశారు. నియోజవర్గానికి 3500 చొప్పున లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పథకం కింద ఇండ్లులేని నిరుపేదల ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేయనుంది. మెుత్తం నాలుగు విడతల్లో సాయం అందిచనుండగా.. తొలి విడత రూ. లక్ష పలువురి లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు. తాజాగా.. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. చెంచులకు గుడ్‌న్యూస్ చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో భూమి లేని చెంచుల విషయాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తామన్నారు. రానున్న పది రోజుల్లోగా అందరికీ ఇండ్లు కేటాయిస్తామని కీలక ప్రకటన చేశారు.
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించిన సీఎం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. అచ్చంపేట నియోజకవర్గాన్ని సోలార్ విద్యుత్ ఆధారిత వ్యవసాయానికి దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. రాబోయే వంద రోజుల్లో నియోజకవర్గంలోని రైతులందరికీ వంద శాతం సబ్సిడీతో సోలార్ విద్యుత్ పంపుసెట్లను అమర్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పథకం ద్వారా రైతులు ఉత్పత్తి చేసే సోలార్ విద్యుత్‌ను వ్యవసాయానికి, గృహావసరాలకు వినియోగించుకుని మిగులు విద్యుత్‌ను ప్రభుత్వ గ్రిడ్‌కు అనుసంధానం చేయడం ద్వారా నెలకు 3 నుంచి 5 వేల రూపాయల ఆదాయం పొందవచ్చని సీఎం తెలిపారు.
ఈ పథకంపై లబ్దిదారులకు అధికారులు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని, కార్యక్రమ పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారిని నియమించాలని ఆదేశించారు. వచ్చే ఏడాది ఇదే రోజున ఈ పథకం పురోగతిని పరిశీలిస్తానని ఆయన వెల్లడించారు. అందులో భాగంగానే.. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో భూమి లేని చెంచుల విషయాన్ని ప్రత్యేకంగా పరిశీలించి పది రోజుల్లోగా అందరికీ ఇళ్లు కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. సీఎం ప్రకటనతో చెంచులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా ఏళ్లుగా సరైన గూడు లేక కాలం వెళ్లదీస్తున్నామని.. ఇండ్ల నిర్మాణానికి సాయం చేస్తే తమ బతుకులు బాగుపడతాయని అంటున్నారు.
![]() |
![]() |