ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేద విద్యార్థులకు ఉచిత ఉన్నత విద్య, రైతులకు రుణమాఫీ

national |  Suryaa Desk  | Published : Wed, Mar 04, 2026, 11:09 PM

తమిళనాడు శాసనసభ ఎన్నికలకు మరో వారం పది రోజుల్లో షెడ్యూల్ వెలువడనుండగా.. డీఎంకే, అన్నాడీఎం, బీజేపీ సహా రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. తొలిసారి బరిలోకి దిగుతున్న ఇళయ దళపతి, టీవీకే అదినేత విజయ్ బుధవారం తన ఎన్నికల మేనిఫెస్టోలోని కీలక హామీలను వెల్లడించారు. తాము అధికారంలోకి వస్తే పేద కుటుంబాలు, చిన్న, సన్నకారు రైతుల పిల్లలకు ఉచితంగా ఉన్నత విద్య, ఐదు ఎకరాలలోపు రైతులకు వ్యవసాయ రుణాల మాఫీ, అవినీతి అంతానికి కఠిన చర్యలు తీసుకుంటానమి హామీ ఇచ్చారు. తంజావూర్‌లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన తమిళ వెట్రి కళగం (టీవీకే) అధినేత.. రాబోయే ఎన్నికలు తనకు, తన మద్దతుదారులకు తీవ్ర భావోద్వేగంతో కూడుకున్నవని, ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.


రెండు ఎకరాలలోపు భూమి ఉండే రైతు కుటుంబాలకు చెందిన పిల్లల ఉన్నత విద్యకు అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తామని అన్నారు. పెరుగుతున్న విద్యా ఖర్చులతో ఇబ్బంది పడుతున్న ఆర్థికంగా బలహీనమైన గ్రామీణ కుటుంబాలకు మద్దతు ఇవ్వడం ఈ హామీ లక్ష్యం. అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామనే విజయ్ హామీ తమిళ రాజకీయాల్లో తన పార్టీని స్వచ్ఛతకు ప్రత్యామ్నాయంగా చెప్పుకునే ప్రయత్నంగా భావించవచ్చు. రాబోయేది తమ ప్రభుత్వమేనని, మత్స్యకారులకు రక్షణ కల్పిస్తానని విజయ్ హామీ ఇచ్చారు.


ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు సహకార పంట రుణాలను మాఫీ చేస్తామని విజయ్ హామీ ఇచ్చారు. రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు, భూమిలేని కార్మికుల పిల్లల విద్యా ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.


ఇదే సమయంలో అధికార డీఎంకేను దుష్ట శక్తితో పోల్చుతూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎంకే, అన్నాడీఎంకేలు తనను అధికారంలోకి రాకుండా అడ్డుకోడానికి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని దుయ్యబట్టారు. విజయ్ తన ఎన్నికల మేనిఫెస్టో ప్రకటనకు తంజావూర్‌ను ఎంచుకోడానికి కారణం ఉన్నత విద్యా శాఖ మంత్రి గోవి చెంజియన్ ఈ జిల్లాకు చెందినవారే కావడం. ఈ జిల్లాలో మొత్తం 8 అసెంబ్లీ స్థానాలకు గానూ.. 2021లో డీఎంకే ఏడు చోట్ల విజయం సాధించింది. అన్నాడీఎంకే ఒక్క సీటుకే పరిమితమైంది.


భార్య సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేసిన కొద్ది రోజుల్లోనే విజయ్ ఎన్నికల మెనిఫెస్టోను విడుదల చేయడం గమనార్హం. విజయ్, సంగీతలకు 1999లో వివాహం కాగా.. వీరికి ఇద్దరు పిల్లలు. తన భర్తకు వేరే నటితో వివాహేతర సంబంధం ఉందని, తనకు విడాకులు కావాలని కోరుతూ ఆమె కోర్టుకు వెళ్లారు. ఇక, ఇదే సమయంలో తన జననాయగన్ సినిమా విడుదల వివాదంపై కూడా విజయ్ మాట్లాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa