ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలోకి ప్రవేశించే తర్వాతి దేశం పాకిస్థానే కావచ్చు

international |  Suryaa Desk  | Published : Wed, Mar 04, 2026, 11:02 PM

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్దంతో పశ్చిమాసియాలో పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది. అమెరికా స్థావరాలు, దాని మిత్రదేశాలను ఇరాన్ టార్గెట్ చేసింది. దీంతో ఎక్కడికక్కడ విమానాలు నిలిచిపోయి, చమురు సరఫరా ఆగిపోయింది. గత ఐదు రోజులుగా ఎటుచూసినా బాంబుల మోత, యుద్ధ సైరన్లు శబ్దాలే వినిపిస్తున్నాయి. రోజు రోజుకూ యుద్ధం తీవ్రతరం అవుతుండటంతో ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక, సౌదీ అరేబియాలో ఒక చిన్న ఇరానియన్ ఆత్మాహుతి డ్రోన్ చేసిన పని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్థాన్‌ను ఈ యుద్ధం వైపు ఆకర్షిస్తుంది. దీనికి సౌదీతో కుదిరిన వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందమే కారణం.


సెప్టెంబరు 2025లో సౌదీ అరేబియా, పాకిస్థాన్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం.. ఈ రెండు దేశాల్లో దేనిపైనైనా దాడి జరిగినా ఇద్దరిపై దాడి జరిగినట్టు పరిగణించాలి. అయితే, అందులో అణ్వాయుధాలు ఉన్నాయా లేదా అనే దానిపై స్పష్టమైన వివరణ లేదు. ఈ విషయంలో పాకిస్థాన్ ఆలోచన ఏంటి అనేది ఆ దేశ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్.. సౌదీపై దాడిచెయొద్దని ఇరాన్‌కు పంపిన సందేశాన్ని బట్టి అర్ధమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మా రెండు దేశాల మధ్య రక్షణ ఒప్పందం ఉందని వాళ్లకు స్పష్టంగా చెప్పానని దార్ అన్నారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడుల తర్వాత పాక్ ఉద్దేశాన్ని బయపెట్టిన తొలి ప్రకటన ఇదే. అయితే, గతవారం నుంచి అఫ్గనిస్థాన్‌లోని తాలిబన్లు పాక్‌పై దాడులు చేస్తున్నా.. సౌదీ అరేబియా కూడా స్పందించలేదు. దీంతో ఇది కాగితాలకే పరిమితమా? అనే వాదన వినిపిస్తోంది.


వ్యూహాత్మక సైనిక రక్షణ ఒప్పందంలో అత్యంత వివాదాస్పదమైన అంశం పాక్ తన అణు సామర్థ్యాలను సౌదీకి విస్తరించేందుకు వీలు కల్పించిందేమోనన్న అనుమానాలను రేకిత్తిస్తోంది. దోహా, ఖతార్‌పై గతేడాది సెప్టెంబరులో ఇజ్రాయెల్ వైమానిక దాడుల తర్వాత గల్ఫ్ భద్రతను కాపాడటంలో అమెరికా సామర్థ్యంపై సందేహాలు తలెత్తాయి. దీంతో సౌదీ కొత్త భాగస్వాముల కోసం అన్వేషణ ప్రారంభించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.


అయితే, పశ్చిమాసియా యుద్ధంలో పాకిస్థాన్ నేరుగా పాల్గొనే అవకాశాలు తక్కువే కానీ, ఈ ఒప్పందం కారణంగా సౌదీ దౌత్యపరమైన చర్యలకు రాజకీయ మద్దతు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. పాక్ విదేశాంగ మంత్రి కేవలం వార్నింగ్‌కే పరిమితమయ్యారు. తమ దేశం సౌదీ అరేబియా తరఫున పాక్ పోరాడుతుందని మాత్రం ఆయన ఎక్కడా అనలేదు.


అలాగే, ఈ ఒప్పందం అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం స్ఫూర్తి విరుద్ధమా? ఐక్యరాజ్యసమితి అణు ఆయుధాల నిషేధ ఒప్పందాన్ని బలహీనపరుస్తుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పాక్ తాము సౌదీకి అణు భద్రతను విస్తరించామని అధికారికంగా ప్రకటించలేదు. అయినప్పటికీ అణ్వాయుధాలు లేని మిత్రదేశానికి తన అణు సహకారం విస్తరించిందా? అదే జరిగితే అంతర్జాతీయ సమాజానికి ఏ విధమైన సంకేతం పంపుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


అంతర్జాతీయ అణు నిరాయుధీకరణ నివేదికలో లండన్‌కు చెందిన థింక్ ట్యాంక్ ఛాతమ్ హౌస్ విశ్లేషకులు.. ‘ఎన్పీటీ బయట ఉన్న దేశమైన అణుశక్తి కలిగిన పాకిస్థాన్ నేరుగా అణ్వాయాధాల ప్రస్తావన లేకపోయినా ఈ ఒప్పందం ద్వారా దాని విస్తరణకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది’ అని హెచ్చరించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa