ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిద్ర లేపి మరీ ఎనలైజర్ టెస్టులు.. ,,,: ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఆవేదన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, May 30, 2025, 07:23 PM

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)లో విజిలెన్స్ అధికారులు అర్ధరాత్రి వేళల్లో చేపడుతున్న బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు కార్మికులను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాయని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న మండిపడ్డారు. జేఏసీ కో-చైర్మన్ కె. హన్మంతు ముదిరాజ్, వైస్ చైర్మన్ ఎం. థామస్ రెడ్డిలతో కలిసి ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఈ పద్ధతి సరైంది కాదని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు పగలు శ్రమించి, రాత్రి వేళల్లో డిపోలలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో వారి నిద్రకు భంగం కలిగిస్తున్నారని జేఏసీ నాయకులు ఆరోపించారు. డ్యూటీలో లేని కార్మికులకు కూడా నాసిరకం బ్రీత్ ఎనలైజర్ మిషన్లతో బలవంతంగా పరీక్షలు నిర్వహించి.. కేసులు నమోదు చేస్తూ భయపెడుతున్నారని విమర్శించారు. ఏడీసీ, కంట్రోలర్, గ్యారేజీ సిబ్బందిని సైతం రాత్రి వేళల్లో ఇదే తరహాలో ఇబ్బందులకు గురిచేస్తూ వారి మానసిక ప్రశాంతతను దూరం చేస్తున్నారని పేర్కొన్నారు.


ఈ నెల 27న జరిగిన వెల్ఫేర్ బోర్డు సమావేశంలో యాజమాన్యం బోర్డు సభ్యులను అడ్డుపెట్టుకుని, కార్మిక సంఘాలపై తమ వ్యతిరేకతను వెళ్లగక్కిందని జేఏసీ ఆరోపించింది. కార్మికులను యూనియన్లకు దూరం చేసే విధంగా సంఘాలపై ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టింది. యాజమాన్యం తమకు కార్మికులపై ప్రేమ ఉన్నట్లు పైకి చెబుతూనే, ఉద్దేశపూర్వకంగా వేధింపులకు పాల్పడుతోందని జేఏసీ నాయకులు ఫైర్ అయ్యారు.


ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తమ హక్కుల కోసం నిజాయితీగా పోరాడే సంఘాలను కార్మికులు ఎప్పటికీ విడిచిపెట్టరని ఈదురు వెంకన్న స్పష్టం చేశారు. ఆర్టీసీ యాజమాన్యం రాచరికపు పాలనకు అలవాటు పడి, కార్మిక సంఘాలపై దుష్ప్రచారం చేస్తోందని, యూనియన్లు అవసరం లేదని ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు సమర్పిస్తూ పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. ప్రతి డిపోలో ఇష్టారాజ్యంగా కిలోమీటర్ల పేరుతో పనిగంటలు పెంచుతూ, శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వడం లేదని అన్నారు.


యాజమాన్యం అనుసరిస్తున్న ఈ కార్మిక వ్యతిరేక విధానాల వలన కార్మికులలో అసహనం పెరిగి, తద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని జేఏసీ నాయకులు హెచ్చరించారు. అంతేకాకుండా.. ఆర్టీసీ కార్మికవర్గాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చేలా యాజమాన్యం వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ యాజమాన్య నిరంకుశ విధానాలను రూపుమాపడానికి తగు ఆదేశాలు జారీ చేసి, కార్మికులలో నెలకొన్న భయాందోళనలను తొలగించాలని డిమాండ్ చేశారు. సమ్మె వాయిదా వేసిన సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ కార్మికులందరూ సంబురాలు చేసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జేఏసీ విజ్ఞప్తి చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa