తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీడీపీ మంత్రి నారా లోకేష్ మధ్య జరిగినట్లు చెబుతున్న రహస్య భేటీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులతో సమావేశాల అనంతరం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. ‘అర్ధరాత్రి లోకేష్‌తో డిన్నర్ మీటింగ్ ఎందుకు చేశారో కేటీఆర్ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
కేటీఆర్, లోకేష్ భేటీ గురించి కాంగ్రెస్ పార్టీ గతంలోనూ ఆరోపణలు చేసింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో టీడీపీ మద్దతు కోసం కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి పోటీ చేసినా.. అతనికి మద్దతు ఇవ్వకుండా.. మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తే వారికే మద్దతు ఇవ్వాలని కేటీఆర్ కోరినట్లు సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మాగంటి గోపీనాథ్, టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నప్పటికీ.. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బీఆర్ఎస్‌లో చేరి రెండుసార్లు విజయం సాధించారు. అయితే... ఇటీవల ఆయన మరణించడంతో ఉపఎన్నిక అనివార్యమైంది.
ఈ ఆరోపణలపై ఇప్పటివరకు బీఆర్ఎస్ గానీ, టీడీపీ గానీ స్పందించలేదు. కేటీఆర్, లోకేష్ మధ్య భేటీ జరిగిందా లేదా అనేది అస్పష్టంగా ఉంది. అయితే.. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఈ ఆరోపణలను చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ సహకరిస్తేనే మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తామని.. లేదంటే ఇతరులకు ఇస్తామని కేటీఆర్ అన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఇదే చిట్‌చాట్‌లో రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కూడా విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో హడావుడి చేయడం లేదని, నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అన్ని విచారణలు పారదర్శకంగా జరుగుతాయని ఆయన హామీ ఇచ్చారు. కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన రేవంత్‌రెడ్డి, తాము మాత్రం ఈ కేసులను వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చురుకుగా సాగుతోందని, మరిన్ని అరెస్టులు కూడా ఉంటాయని ఆయన సంకేతాలు ఇచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన పాలనపై వస్తున్న విమర్శలకు దీటుగా స్పందించారు. ముఖ్యంగా బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం కేంద్రంతో చర్చలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. 'ఇండియా, పాకిస్తాన్ మధ్యే నీటి పంపిణీపై చర్చలు జరుగుతుంటే, నేను పక్క రాష్ట్రం సీఎంతో మాట్లాడితే తప్పేంటి?' అని ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ ఎలాంటి చర్చలు జరగలేదని పేర్కొన్న సీఎం, ఇప్పటికే మూడు సమస్యలను పరిష్కరించామని తెలిపారు.
మిగిలిన అంశాలపై అధికారులు, సాంకేతిక నిపుణుల కమిటీ చర్చిస్తుందని, 'నేను ఇంజనీర్‌ను కాదు.. సాంకేతిక అధ్యయనం తర్వాతే నిర్ణయం తీసుకుంటాం' అని వివరించారు. ప్రజలు తమకు అధికారం ఇచ్చారని, రాష్ట్ర సమస్యలను కేంద్రానికి చేరవేయడం తన బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు. 'ఢిల్లీకి కాకుండా ఫామ్‌హౌస్‌కు వెళ్తే సమస్యలు పరిష్కారం కావు' అని పరోక్షంగా కేసీఆర్‌ను విమర్శించారు. నెలకు కనీసం రెండు సార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులతో సమన్వయం చేసుకుంటానని హామీ ఇచ్చారు.
ప్రతిపక్షాలపై విమర్శల వర్షం..
ప్రతిపక్ష నేత కేసీఆర్‌తో అసెంబ్లీలో చర్చకు సిద్ధమని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. 'కేటీఆర్ నాయకత్వాన్ని చెల్లెలే అంగీకరించడం లేదు. గతంలో సవాల్ విసిరితే పారిపోయారు' అంటూ కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. 'గంజాయి బ్యాచ్‌కి నేను భయపడను. భయపడితే నేను రేవంత్ రెడ్డి అవుతానా?' అంటూ ధ్వజమెత్తారు.
బీసీ రిజర్వేషన్లపై తమదైన వ్యూహం ఉందని, కేటీఆర్ డ్రగ్స్ కేసుపై.. గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరుగుతుందని తెలిపారు. 'విలన్లు క్లైమాక్స్ లోనే అరెస్ట్ అవుతారు' అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డికి బీసీ రిజర్వేషన్లపై సవాల్ విసిరిన రేవంత్, ఫోన్ ట్యాపింగ్ కేసుపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంతో కలిసి పని చేస్తామని, కేసీఆర్ సభకు రావాలని ఆహ్వానించారు. తనపై ఉన్న కేసులపై తొందరపడబోనని, చట్టం తన పని తాను చేసుకుంటుందని, హడావుడి చేస్తే మీడియానే ప్రశ్నిస్తుందని అన్నారు. బీజేపీ సీబీఐ కేసుల పేరుతో రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. రెండేళ్ల తర్వాత కార్పొరేషన్ నామినేటెడ్ పోస్టులను తిరిగి భర్తీ చేస్తామని.. ప్రస్తుతం 65 కార్పొరేషన్లకు రెండేళ్ల పదవీకాలంతో నియామకాలు జరిగాయని సీఎం వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa