వాహనదారులకు ముఖ్య గమనిక.. మీ బండికి ఇంకా హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (HSRP) లేకపోతే, వెంటనే మార్చుకోండి. ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉంది. చాలా మంది వాహనదారులు.. ముఖ్యంగా 2019 ఏప్రిల్ కన్నా ముందు బండ్లు కొన్నవాళ్లు, తమ పాత నంబర్ ప్లేట్లతోనే తిరుగుతున్నారు. కొంతమందికైతే, తాత్కాలిక నంబర్లతో ఏళ్ల తరబడి వాహనాలను నడుపుతున్నారు. దీనివల్ల ప్రమాదాలు జరిగినప్పుడు గానీ, దొంగతనాలు జరిగినప్పుడు గానీ, బండి యజమానిని గుర్తించడం కష్టమవుతోంది. ఈ గందరగోళానికి తెరదించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని వాహనాలకు HSRP తప్పనిసరి చేసింది. దీని కోసం సెప్టెంబర్ 30, 2025 వరకు గడువు విధించింది.
ఎందుకు HSRP అవసరం..?
HSRP అంటే హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్. ఇది సాధారణ నంబర్ ప్లేట్ లా ఉండదు. ఇందులో వాహన వివరాలు, తయారీ వివరాలు, రిజిస్ట్రేషన్ డేటా వంటివి ఒక ప్రత్యేక కోడింగ్ ద్వారా పొందుపరిచి ఉంటాయి. దీనివల్ల నకిలీ నంబర్ ప్లేట్లను వాడటం కష్టం అవుతుంది. అంతేకాకుండా.. దొంగతనాలు, నేరాలను అరికట్టడంలో ఇది పోలీసులకు చాలా ఉపయోగపడుతుంది.
HSRP లేకపోతే వచ్చే సమస్యలు..
రవాణా శాఖ, పోలీసులు తనిఖీ చేసినప్పుడు పట్టుబడితే పెద్ద మొత్తంలో జరిమానాలు పడతాయి. మీ బండిని ఇతరులకు అమ్మాలనుకుంటే, HSRP లేకపోతే అమ్మడం సాధ్యం కాదు. ప్రమాదం జరిగినప్పుడు బీమా క్లెయిమ్ చేసుకోవడం, పొల్యూషన్ సర్టిఫికెట్ తీసుకోవడం కుదరదు. బండిని ఇతరుల పేరు మీద బదిలీ (ట్రాన్స్‌ఫర్) చేయాలంటే కుదరదు.
అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు వాహనానికి, వ్యక్తులకు తగిన సహాయం అందకపోవచ్చు.
HSRP పొందడం ఎలా.. ?
HSRP కోసం దరఖాస్తు చేసుకోవడం చాలా సులువు. మీరు రవాణా శాఖ వెబ్‌సైట్ లేదా ఎస్‌ఐఏఎం (SIAM) వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. SIAM వెబ్‌సైట్ పేజీని తెరిచి.. అందులో HSRP రిజిస్ట్రేషన్ ప్లేట్‌ను ఎంచుకోండి. మీ వాహన వివరాలు సరిగ్గా నమోదు చేయండి. బుకింగ్ ప్రక్రియను పూర్తి చేయండి. తర్వాత నిబంధనల ప్రకారం నిర్ణయించిన రుసుమును చెల్లించండి. చెల్లింపు పూర్తయ్యాక, నంబర్ ప్లేట్ మీ ఇంటికి వస్తుంది. దాన్ని మీ వాహనానికి బిగించి.. ఆ ఫోటోను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
HSRP ఖర్చులు సుమారుగా..
బైక్‌లకు: రూ. 320 - 380 (ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్న బైక్‌లకు రూ. 400 - 500)
కార్లకు: రూ. 590 - 700 (ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్న కార్లకు రూ. 700 - 800)
ఆటోలు, మూడు చక్రాల వాహనాలకు.. రూ. 350 నుంచి రూ. 450 మధ్యలో ఉంటుంది. వాణిజ్య వాహనాలకైతే రూ. 600 నుంచి రూ. 800 మధ్య ఉంటుంది.
రవాణా శాఖ అధికారులు యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం ఎన్ని పాత వాహనాలున్నాయి, ఎన్ని కొత్త వాహనాలున్నాయి అనే వివరాలను సేకరిస్తున్నారు. 2019 ఏప్రిల్ తర్వాత రిజిస్టర్ అయిన వాహనాలకు HSRP ఇప్పటికే తప్పనిసరి చేశారు. కాబట్టి, ఆ బండ్లకు పెద్దగా సమస్య ఉండదు. కానీ.. అంతకు ముందు రిజిస్టర్ అయిన వాహనాలు, లేదా HSRP విరిగిపోయిన బండ్ల యజమానులు వెంటనే మార్చుకోవాలి.
కొంతమంది రైతులు, ఇతర వర్గాల వారు ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ వాహనాలు, కొన్ని బైక్‌లు తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్లతో ఏళ్లుగా తిప్పుతున్నారు. అంతేకాకుండా.. కొంతమంది HSRP షోరూమ్‌లకు వచ్చినా, వాటిని బిగించుకోవడం లేదని అధికారులు గుర్తించారు. ఇలాంటి వాహనాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. చాలా కాలంగా రిజిస్ట్రేషన్ చేసుకోని వాహనాలను గుర్తించి.. వాటిని రిజిస్ట్రేషన్ చేయించడంతో పాటు HSRP బిగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. యాదాద్రి జిల్లా రవాణాశాఖ అధికారి సాయికృష్ణ ఈ విషయంపై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. కాబట్టి.. సెప్టెంబర్ 30 లోగా మీ వాహనానికి HSRP బిగించుకుని జరిమానాల బారి నుంచి తప్పించుకోండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa