తెలంగాణ శాసనసభ సమావేశాలు నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ నెల 30వ తేదీ నుంచి ఈ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు సమాచారం. మొత్తం 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే శాసనసభ సమావేశాలు ప్రారంభం కావడానికి ఒకరోజు ముందు అంటే.. ఈనెల 29వ తేదీన తెలంగాణ మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నిర్ణయాన్ని ఈ కేబినెట్ భేటీలోనే తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన కమిషన్ ఇచ్చిన రిపోర్టును చర్చించేందుకే ఈ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.
మరోవైపు.. ఇటీవల ఆకస్మికంగా మరణించిన జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు.. సమావేశాల తొలి రోజే అసెంబ్లీలో సంతాపం ప్రకటించనున్నారు. అదే సమయంలో ఈ సమావేశాల్లోనే ఉపసభాపతిని ఎంపిక చేయడంపైనా నిర్ణయం తీసుకోనున్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికకు ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
ఈ నేపథ్యంలోనే ఈ సమావేశాల్లో పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇక ఈ సమావేశాల్లోనే సభలోని ఎమ్మెల్యేలందరికీ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్‌ను ప్రభుత్వం అందించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ అసెంబ్లీ సమావేశాలు దాదాపు 5 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కోసం ఇప్పటికే అసెంబ్లీ సిబ్బందికి సంబంధిత ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన రిపోర్టు 600 పేజీలకు పైగా ఉంది. ఈ ఈ రిపోర్టును సభ్యులందరికీ అందజేసి.. అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకుని.. ఆ తర్వాత దీనిపై పూర్తి స్థాయిలో చర్చించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. చర్చల తర్వాత.. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు సంబంధించి తుది నిర్ణయాలు తీసుకోనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa