ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హరీష్‌రావు, సంతోష్‌రావు వెనక నేనెందుకు ఉంటాను..: సీఎం రేవంత్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 03, 2025, 07:17 PM

హరీశ్ రావు, సంతోష్ రావు వెనుకాల రేవంత్ రెడ్డి ఉన్నారన్న కవిత ఆరోపణల పట్ల ముఖ్యమంత్రి స్పందించారు. ప్రజలు తిరస్కరించిన వారి వెనుకాల నేనెందుకు ఉంటాను.. అనవసరంగా మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలంలోని వేముల గ్రామంలో SGD ఫార్మా రెండో యూనిట్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “రాజకీయాలు శాశ్వతం కావు. ఒకప్పుడు ఇతర పార్టీలను బతకనివ్వకుండా చేసిన వారు, ఇప్పుడు తమ కుటుంబం మధ్యే గొడవలకు దిగారు. చరిత్ర తిరగబడుతుంది. చేసిన పాపం ఎప్పటికీ వదలదు” అని వ్యాఖ్యానించారు.


నాటి పాలకులు శాసనసభ్యులను రాత్రికిరాత్రే కేసులు పెట్టి జైలులో పెట్టేవారు. అదే వ్యక్తులు ఇప్పుడు ఒకరినొకరు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. విపరీతమైన అవినీతి సొమ్ము పంపకాలలో కుటుంబ పంచాయతీలు మొదలయ్యాయి. దాంతో ఒకరి మీద ఒకరు యాసిడ్ దాడులు చేసుకునే వరకు దిగజారిపోయారు. బయట నవ్వుకున్నా, లోపల కత్తులు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది


రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి


ఇలాంటి వ్యక్తుల వెనుక నేను ఎందుకు ఉండాలి? ప్రజల తిరస్కారం పొందిన వారిని నిలబెట్టే బాధ్యత నాదేం కాదు. నా పని పాలమూరు జిల్లా సహా మొత్తం తెలంగాణ ప్రజలకు అండగా నిలబడటం. రాష్ట్రానికి న్యాయం జరిగేలా ముందుండి పని చేయడమే నా లక్ష్యం” అని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీడీపీ రాజకీయ ప్రాధాన్యంపై మాట్లాడారు. ఒకప్పుడు గొప్ప పేరున్న జనతా పార్టీ కనుమరుగైంది. ఆ తర్వాత, అనేక అవకాశాలను కల్పించిన అద్భుతమైన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ నుండి అనేక మంది పెద్ద నాయకులు ఎదిగారు. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ కుట్రల వలన టీడీపీ అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. ఒక శక్తివంతమైన పార్టీని సజీవంగా దెబ్బతీయడం ఆచరణలో జరిగిందని చరిత్రే చెబుతుంది” అని అన్నారు.


అలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ ఎలా మనుగడ సాగిస్తుందని మీరు అనుకుంటున్నారు? చరిత్రలో ఇదే తరచుగా జరిగిందని, చివరికి ప్రజల తీర్పే నిర్ణయాత్మకమవుతుందన్నారు. ప్రకృతి అనేది ఎప్పుడూ సమానంగా ఉండదు. ఎవరి మీదైనా శిక్ష విధించగల శక్తి ప్రకృతికి ఉంది. మీరు ఎంతకాలం వంచన, కుతంత్రాలతో ముందుకు సాగినా చివరికి న్యాయం గెలుస్తుందని స్పష్టం చేశారు. ఒక పార్టీని కూలదోయడానికి చేసిన కుట్రలు తాత్కాలికంగా ఫలితాలిచ్చినా, శాశ్వతంగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోతాయి. ప్రజాస్వామ్యంలో నమ్మకాన్ని నిలబెట్టుకోలేని రాజకీయ శక్తులు ఎప్పటికీ బతకలేవన్నారు.


అలాగే పాలమూరు జిల్లా ప్రాధాన్యం గురించి ప్రాస్తావించారు. పాలమూరు జిల్లకు పక్కనే కృష్ణా నది పారుతున్నా.. ఈ ప్రాంతం ఎన్నో ఏళ్లుగా తాగునీరు, సాగునీటి సమస్యలతో బాధపడింది. గత ప్రభుత్వాలు ఎలాంటి కృషి చేయలేదు. అయితే ఇప్పుడు ప్రాజెక్టులకు గ్రీన్ చానల్ ద్వారా నిధులు కేటాయిస్తున్నాం” అని తెలిపారు. కొడంగల్–నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, నెట్టెంపాడు, కోయల్ సాగర్, సంగంబండ, బీమా వంటి పనులను పూర్తి చేయడమే తన లక్ష్యమని ఆయన అన్నారు. “భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం అందిస్తాం. ప్రతి రైతుతో నేరుగా మాట్లాడి వారికి సరైన ధర అందేలా చర్యలు తీసుకుంటాం. ఎవరికీ అన్యాయం జరగదు” అని హామీ ఇచ్చారు. పాలమూరు జిల్లా అభివృద్ధికి "ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషనే మై ఫస్ట్ ప్రయారిటీ’ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా పేర్కొన్నారు.


ప్రాంతీయ సమస్యలపై మాట్లాడుతూ.. గతంలో మన వెనుకబాటు, పేదరికాన్ని ఒక ఎగ్జిబిషన్‌లా చూపించారు. విదేశీ ప్రతినిధులను తీసుకొచ్చి పాలమూరు దుస్థితిని చూపేవారు. కానీ భవిష్యత్‌లో మన అభివృద్ధిని చూసేందుకు వారు రావాల్సి ఉంటుంది. రాష్ట్రానికి వచ్చే ప్రతి అభివృద్ధి అవకాశంలో మొదటి ముద్ద పాలమూరుకే పెడతాం. ఇది నా నిబద్ధత అని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ప్రాజెక్టులను అడ్డుకోవాలని చేస్తున్న తప్పుడు ప్రచారాలను మీడియా ఖండించాలని కోరారు. ఈ జిల్లా నుంచి బూర్గుల రామకృష్ణారావు తర్వాత దాదాపు 75 ఏళ్లకు ముఖ్యమంత్రి వచ్చాడు. కాబట్టి ఇది చారిత్రాత్మక అవకాశం. మనం ఇప్పుడు వెనుకడుగు వేస్తే ఇక ఎప్పుడూ అవకాశమే ఉండదు” అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa