హైదరాబాద్ నగరం మరోసారి గణేష్ నిమజ్జన మహోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు రూట్ మ్యాప్ విడుదల చేసి, సెప్టెంబర్ 6 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 7 ఉదయం 10 గంటల వరకు ప్రత్యేక ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. బాలాపూర్ నుంచి ప్రారంభమయ్యే ప్రధాన శోభాయాత్ర చార్మినార్–అబిడ్స్–లిబర్టీ–ట్యాంక్‌బండ్–నెక్లెస్ రోడ్ మీదుగా సాగనుంది. ఈ రూట్లపై ఇతర వాహనాలకు ప్రవేశం లేకుండా పూర్తి నియంత్రణ విధించబడింది.
సౌత్ జోన్:
అలియాబాద్, మదీనా, నయాపూల్, ఎంజే మార్కెట్, దరుశ్షిఫా వద్ద పరిమితులు.
సెంట్రల్ జోన్:
లిబర్టీ, అబిడ్స్, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, బుద్ధభవన్ దగ్గర ఆంక్షలు.
నార్త్ జోన్:
పాట్నీ, పరడైజ్, రాణిగంజ్ మార్గాల్లో వాహన రాకపోకలపై నియంత్రణ.
పార్కింగ్ ఏర్పాట్లు..
భక్తుల సౌకర్యం కోసం ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ ఆలయం, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధభవన్ వెనుకభాగం, ఆదర్శనగర్, బీఆర్‌కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటిఎస్ స్టేషన్ వద్ద పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు.
లారీలు, బస్సులపై నియంత్రణ..
సెప్టెంబర్ 6 ఉదయం 8 నుంచి సెప్టెంబర్ 7 రాత్రి 11 వరకు నగరంలోకి లారీలు రాకుండా ఆంక్షలు అమల్లోకి వస్తాయి. లారీలు కేవలం ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మాత్రమే నడవాలి. ఆర్టీసీ బస్సులు పీక్ టైంలో మెహిదీపట్నం, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, నారాయణగూడ వరకు మాత్రమే నడుస్తాయి. అంతర్రాష్ట్ర, జిల్లా బస్సులు చాదర్‌ఘాట్ మార్గం ద్వారా మళ్లించబడతాయి.
ఎంజే మార్కెట్, ఖైరతాబాద్, అబిడ్స్, లిబర్టీ, రాణిగంజ్, తెలుగు తల్లి చౌరస్తా, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా వంటి జంక్షన్లను వాహనదారులు తప్పించుకోవాలి. విమానాశ్రయం వెళ్లేవారు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే లేదా ఔటర్ రింగ్ రోడ్ మాత్రమే ఉపయోగించాలి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళే ప్రయాణికులు బేగంపేట్–ప్యారడైజ్ రూట్ ఎంచుకోవాలి.
నిమజ్జన ఏర్పాట్లు..
భక్తుల సౌలభ్యం కోసం 10 బేబీ పాండ్లు, 8 పోర్టబుల్ వాటర్ ట్యాంకులు, 8 ఎక్స్కవేషన్ పాండ్లు ఏర్పాటు చేశారు. అదనంగా భారీ విగ్రహాల కోసం ప్రత్యేక టస్కర్ ట్రాలీలు, క్రేన్లు, సపోర్టింగ్ వర్క్ టీమ్‌లు సిద్ధంగా ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో 040-27852482, 8712660600, 9010203626 నంబర్లను సంప్రదించవచ్చు.
ఖైరతాబాద్ గణేష్ ప్రత్యేకత..
హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో ప్రధాన ఆకర్షణ ఖైరతాబాద్ గణనాథుడే. 69 అడుగుల ఎత్తు, 40–50 టన్నుల బరువు కలిగిన ఈ విగ్రహాన్ని విజయవాడ నుంచి తెప్పించిన 26 చక్రాల టస్కర్ ట్రాలీ మీద నిమజ్జనానికి తరలిస్తున్నారు. శుక్రవారం రాత్రి నుంచి వెల్డింగ్ పనులు, ప్రత్యేక పూజలు పూర్తి చేసి, శనివారం తెల్లవారుజామున హుస్సేన్ సాగర్ వైపు శోభాయాత్ర ప్రారంభం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa