తెలుగు రాష్ట్రాల్లో వాహనదారులపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పోలీసులు కఠినంగా చర్యలు కొనసాగిస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్ లేకుండా ప్రయాణం, ట్రిపుల్ రైడింగ్, రెడ్ సిగ్నల్ జంపిగ్, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడటం వంటి ఉల్లంఘనలపై పోలీసులు ఎలాంటి రాజీ లేకుండా వ్యవహరిస్తున్నారు. కేసులు నమోదు చేసి, అధిక మొత్తంలో జరిమానాలు విధించడం సాధారణంగా మారింది. అయితే ఈ చర్యలు.. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు భారంగా మారి ప్రజలలో ఆందోళన కలిగిస్తున్నాయి. పేద, మధ్య తరగతి వర్గాలు ఈ ఆర్థిక భారం మోయలేక నిరసనలు తెలుపుతున్న దృశ్యాలు తరచుగా కనబడుతున్నాయి.
ఈ నేపథ్యంలో.. హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి రాఘవేంద్ర చారి ఇటీవల హైకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. 2025లో 26655 నంబర్‌తో రిట్ పిటిషన్ దాఖలు చేసిన ఆయన.. ట్రిపుల్ రైడింగ్ చేసినందుకు రూ.1,200 జరిమానా విధించడం చట్ట విరుద్ధమని వాదించారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం ఇలాంటి నేరానికి కేవలం రూ.100 నుంచి రూ.300 వరకు మాత్రమే జరిమానా విధించాల్సి ఉంటుందని.. ఆ పరిమితిని మించి వసూలు చేయడం అన్యాయం అని పిటిషన్‌లో స్పష్టం చేశారు.
పిటిషనర్ తరఫున న్యాయవాది విజయ్ గోపాల్ మాట్లాడుతూ.. ‘వాహనాదులపై భయాన్ని రేకెత్తించే ఉద్దేశ్యంతోనే అధిక మొత్తంలో చలాన్లు వసూలు చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టకుండా, ఆదాయాన్ని పెంచుకోవడానికే అధికారులు ఈ విధానం అవలంబిస్తున్నారు’ అని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలు వాహనదారుల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ కేసును పరిశీలించిన హైకోర్టు.. ట్రాఫిక్ పోలీసులు చట్టం నిర్దేశించిన పరిమితికి మించి జరిమానాలు ఎందుకు వసూలు చేస్తున్నారో వివరణ ఇవ్వాలని హోంశాఖకు, ప్రభుత్వ న్యాయవాదికి ఒక వారం గడువు విధించింది. కోర్టు జోక్యంతో ప్రజలలో న్యాయం లభించవచ్చనే ఆశలు వ్యక్తమవుతున్నాయి.
నిపుణుల అంచనా ప్రకారం.. ఈ కేసు తీర్పు రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ట్రాఫిక్ జరిమానాల అమలు విధానంపై ప్రభావం చూపనుంది. జరిమానాల పరిమితి, అమలులో పారదర్శకత, వాహనదారుల హక్కులు వంటి అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వాహనదారుల భారం తగ్గించడానికి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసే అవకాశమూ ఉన్నట్టు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa