ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బురదలో తిరిగే వారికి ప్రమాదకర వ్యాధి.. గుర్తించకపోతే ప్రాణాలకే ముప్పు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 07, 2025, 07:27 PM

తెలుగు రాష్ట్రాల్లో మెలియాయిడోసిస్‌ అనే కొత్త సంక్రమణ వ్యాధి కలకలం రేపుతోంది. మొదట్లో సాధారణ జ్వరం, దగ్గు, కీళ్ల నొప్పుల మాదిరిగా కనిపించే ఈ వ్యాధి.. సకాలంలో గుర్తించకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. వర్షాకాలంలో బురద, తడి మట్టి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ వ్యాధి విస్తరిస్తోంది. ‘బర్క్‌హోల్డేరియా సూడోమల్లీ’ అనే సూక్ష్మజీవి వల్ల ఈ వ్యాధి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇది రెండు మార్గాల్లో మానవ శరీరంలోకి వెళ్తుంది.


అందులో ఒకటి బురదలో గాయాల ద్వారా.. మరొకటి తేమ ఎక్కువగా ఉన్న గాలి ద్వారా. ఈ వ్యాధికి ఎక్కువగా వ్యవసాయం చేసే రైతులు, కూలీలు ఎక్కువగా ప్రభావితమవుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే అందరికీ రోగం సోకదు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్‌ రోగులు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు, అధిక మద్యం తీసుకునే వారు అధిక ప్రమాదంలో ఉంటారు. ఈ వ్యాధిని సాధారణ రక్త, మూత్ర పరీక్షలతో గుర్తించడం కష్టమని, మైక్రోబయాలజీ ల్యాబ్‌లో చేసే ప్రత్యేక పరీక్షల ద్వారానే నిర్ధారణ సాధ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ల్యాబ్ సదుపాయాలు లేని కారణంగా, వ్యాధి గుర్తింపులో ఆలస్యం అవుతోంది.


లక్షణాలు.. తప్పుదారి పట్టించే చికిత్స..


మెలియాయిడోసిస్‌ సోకినవారికి సాధారణ జ్వరమే మొదటి లక్షణం. దానికి తోడు చలి, కీళ్ల నొప్పులు, దగ్గు, ఛాతి నొప్పి వంటి సమస్యలు కనిపిస్తాయి. ఈ కారణంగా చాలా సందర్భాల్లో డాక్టర్లు న్యూమోనియాగా భావించి చికిత్స చేస్తారు. కానీ మందులు ఆపిన తర్వాత తిరిగి లక్షణాలు మళ్లీ బయటపడతాయి. బురద ద్వారా వ్యాపించే కేసుల్లో చర్మంపై గడ్డలు, పుసు కారడం, వాంతులు, డయేరియా, రక్త ఇన్ఫెక్షన్, సెప్టిక్ షాక్ వచ్చే అవకాశం ఉంది. తీవ్ర స్థాయిలో మూర్ఛ సమస్యలు కూడా రావచ్చు.


చికిత్స పద్ధతి ఇలా..


ఈ వ్యాధి చికిత్స రెండు దశల్లో జరుగుతుంది. మొదట ఇన్‌జెక్షన్ రూపంలో సెఫ్టాజిడైమ్, మెరోపెనెమ్ వంటి యాంటీబయోటిక్స్ 10–14 రోజులు ఇస్తారు. తర్వాతి దశలో కో-ట్రైమాక్సజోల్, డాక్సీసైక్లిన్ వంటి మాత్రలు 3–6 నెలల పాటు ఇస్తారు. ఈ చికిత్స సమయానికి మొదలుపెట్టకపోతే.. వ్యాధి రక్తంలోకి చేరి సెప్సిస్, మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణమవుతుంది. నిమ్స్, ఉస్మానియా, గాంధీ వంటి ప్రధాన ఆసుపత్రుల్లో చికిత్స అందుబాటులో ఉంది. ఆరోగ్యశ్రీ ద్వారా కూడా పేదలకి ఉచితంగా సదుపాయం కల్పిస్తున్నారు.


నిమ్స్‌కు చెందిన వైద్యుల బృందం 12 కేసులపై పరిశోధన జరిపింది. ఎక్కువ మంది రోగులు వ్యవసాయం చేసే వారు, డయాబెటిస్‌ ఉన్నవారే అని తేలింది. ఈ వ్యాధి ద్వారా ఎక్కువగా ఊపిరితిత్తులు, ఎముకలు, లివర్, చర్మం, మెదడు, మూత్రపిండాలు ప్రభావితమవుతున్నాయి. మొత్తం కేసుల్లో సగానికి పైగా రోగులు ప్రాణాలు కోల్పోయారని స్టడీ చెబుతోంది. అంటే అవగాహన లోపం, సకాలంలో చికిత్స లేమి ప్రాణనష్టం పెంచుతున్నాయి.


పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు జిల్లాలోని తురకపాలెంలో ఈ వ్యాధి వల్ల రెండు నెలల్లో 20 మరణాలు సంభవించాయి. అక్కడి ప్రభుత్వం గ్రామంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించింది. ప్రజలకు తాగునీరు, ఆహారం ప్రభుత్వమే అందిస్తోంది. శాంపిల్స్‌ సేకరించి చెన్నైకి పరీక్షలకు పంపారు. ప్రొఫెసర్ ఎంవీఎస్ సుబ్బలక్ష్మి (నిమ్స్) తెలిపిన వివరాల ప్రకారం.. వ్యాధిని తొందరగా గుర్తిస్తే యాంటీబయోటిక్స్‌తో పూర్తిగా నయం చేయవచ్చు. ఆలస్యమైతే ప్రాణాలకు ప్రమాదమని స్పష్టంగా చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు, డాక్టర్లు ఈ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa