హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ఎలాంటి అంతరాయం లేకుండా శాంతియుతంగా ముగియడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజుల పాటు గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించిన ప్రజలు.. ఘనంగా వీడ్కోలు పలికిన తీరు ప్రశంసనీయం అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంలో సీఎం ఒక ప్రకటన విడుదల చేసి.. పోలీసులు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, రవాణా, పంచాయతీ రాజ్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, అలాగే ఉత్సవ కమిటీలు, భక్తులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
హైదరాబాద్ నగరంలో లక్షలాది విగ్రహాలు నిర్ణీత సమయానికి ట్యాంక్ బండ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో విజయవంతంగా నిమజ్జనం చేయబడినందుకు ప్రజలకు సీఎం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ఈసారి అధిక సంఖ్యలో భారీ విగ్రహాలు ఉండటంతో సవాళ్లు ఎదురైనా, అధికారుల కృషి వల్ల ఎటువంటి పెద్ద అపశ్రుతులు జరగలేదని పేర్కొన్నారు. ఉదయం 4 గంటల తర్వాత ఊహించని రీతిలో ట్యాంక్ బండ్ వైపు భారీ విగ్రహాల ఊరేగింపులు రావడంతో కొంతసేపు రద్దీ పెరిగినా.. అధికారులు సమర్థవంతంగా నియంత్రించారని తెలిపారు.
లక్షా 80 వేలకు పైగా విగ్రహాలు..
ఇదిలా ఉండగా.. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. పదిరోజుల పండుగలో మొత్తం లక్షా 80 వేలకుపైగా విగ్రహాలు నిమజ్జనం చేయబడ్డాయని వెల్లడించారు. కేవలం రెండ్రోజుల వ్యవధిలోనే ట్యాంక్ బండ్ వద్ద 25 వేలకుపైగా విగ్రహాలు నిమజ్జనమైనట్లు చెప్పారు. ఇంకా మిగిలిన 900 విగ్రహాలను మధ్యాహ్నం 2 గంటలలోపు నిమజ్జనం చేసే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు.
ఈసారి 40 అడుగుల ఎత్తైన విగ్రహాలు విద్యుత్ వైర్లను తాకడం వలన కొన్ని ఊరేగింపులు ఆలస్యమయ్యాయని, కొన్ని ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయని సీపీ తెలిపారు. కొందరు వ్యక్తులు గొడవకు దిగడంతో ఐదు కేసులు నమోదు చేసినట్లు వివరించారు. అయినప్పటికీ, మొత్తం ఉత్సవం పెద్ద ఎత్తున ఎటువంటి పెద్ద సమస్యలు లేకుండా విజయవంతంగా ముగిసిందని తెలిపారు. నిమజ్జనాలు పూర్తయిన తర్వాత బషీర్‌బాగ్, లిబర్టీ మార్గాలను పూర్తిగా ప్రజలకు తెరవనున్నట్లు, అలాగే ఖైరతాబాద్ రూట్, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ను పునరుద్ధరించనున్నట్లు సీపీ వివరించారు. ట్రాఫిక్ నియంత్రణలో సిబ్బంది శ్రమించారని, ఒకవైపు వాహనాలు అనుమతించి రద్దీని తగ్గించామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa