వినాయక చవితి ఉత్సవాలు కేవలం భక్తిని చాటడమే కాకుండా.. ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టి ఆదుకునే ఒక గొప్ప సామాజిక కార్యక్రమంగా మారింది. చాలా మంది మండపాల్లో అన్నదానం నిర్వహిస్తున్నారు. ఉత్సవాల సమయంలో చాలా మంది భక్తులు, పేదవారు ఆలయాలు, పందిళ్ల వద్ద అందించే ప్రసాదాలు, భోజనాలపై ఆధారపడి కడుపు నింపుకుంటున్నారు. ఇక నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామం వినాయక చవితి ఉత్సవాలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించింది. ఈ గ్రామానికి కేవలం చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా, పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ ఉత్సవాలకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఇక్కడ నిర్వహించే భారీ అన్నదానం. మరో విశేషం ఏంటంటే.. ఇక్కడ అన్నదానం చేయాలంటే మూడేళ్లు నిరీక్షించాలి.
అబ్దుల్లాపూర్‌లో వినాయక చవితి అంటే కేవలం పూజలు మాత్రమే కాదు ఒక గొప్ప సామాజిక యజ్ఞం. ఇక్కడ ఉత్సవాల పదకొండు రోజులు గ్రామ ప్రజలు ఎవరూ తమ ఇళ్లలో పొయ్యి వెలిగించరు. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు అంతా గణపతి ప్రసాదమే. బయటి నుంచి ఎంతమంది భక్తులు వచ్చినా, వారందరికీ ఎలాంటి భేదభావం లేకుండా ఈ ప్రసాదాన్ని అందిస్తారు. రోజుకు లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేసి నిర్వహించే ఈ అన్నదాన కార్యక్రమం మత సామరస్యానికి ఒక గొప్ప ఉదాహరణ. గ్రామంలోని నాలుగు ముస్లిం కుటుంబాలు సైతం ఈ సేవలో చురుగ్గా పాల్గొంటాయి.
అబ్దుల్లాపూర్ వినాయక చవితి అన్నదానంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ గొప్ప కార్యంలో భాగం కావాలని కోరుకునే దాతలు ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ కారణంగా అన్నదానం కోసం వచ్చే మూడేళ్ల వరకూ బుకింగ్‌లు ఇప్పటికే పూర్తిగా పూర్తయ్యాయి. అంటే ఎవరైనా అన్నదానం చేయాలనుకుంటే వారు 2028లో మాత్రమే అందుకు అవకాశం పొందుతారు. అన్నదానం కోసం దాతలు ఇంతలా పోటీ పడటం ఈ ఉత్సవాలకు ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
అబ్దుల్లాపూర్‌లో మరో ప్రత్యేకత శ్రీకాళహస్తి సమీపంలోని ఒక గ్రామంలో ప్రత్యేకంగా తయారు చేయించిన 'మోక్ష (కర్ర) గణపతి. 11వ రోజు ఈ గణపతి విగ్రహాన్ని గోదావరి నది వరకు ఊరేగింపుగా తీసుకెళ్లి విగ్రహంపై నీళ్లు చల్లి, తిరిగి భద్రపరుస్తారు. ఈ వినాయకుడిని వచ్చే సంవత్సరం చవితి ఉత్సవాలకు మళ్లీ ఉపయోగిస్తారు. ఈ గ్రామం కేవలం భక్తిని చాటడమే కాకుండా సామాజిక సేవ, మత సామరస్యానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa