ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే,,,బీసీ రిజర్వేషన్లపై కవిత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 08, 2025, 07:18 PM

తెలంగాణ రాజకీయ వాతావరణం కల్వకుంట్ల కవిత చుట్టే తిరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాల మధ్య ఆమెను సస్పెండ్ చేయడం.. వెంటనే ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. ముఖ్యంగా మాజీ మంత్రి హరీశ్ రావుపై చేసిన సంచలనాత్మక ఆరోపణలు ఈ పరిణామాలకు దారితీశాయి. జైలు నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి కవిత బీఆర్ఎస్ పార్టీలోని కొంతమంది నాయకులపై విమర్శనాత్మక రాగాలు పాడుతూ.. నూతన రాజకీయ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు.


తాజాగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో 70కి పైగా బీసీ సంఘాల ప్రతినిధులతో సమావేశమై కవిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఆమె మాట్లాడుతూ.. బీసీ వర్గాలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ముఖ్యంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని స్పష్టం చేశారు.


ఇక రిజర్వేషన్ల అంశం ఇప్పుడు రాజకీయంగా మరింత కీలకమైంది. తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని గడువు పెట్టినా.. ప్రభుత్వం సన్నద్ధం కాలేదు. రిజర్వేషన్ల వ్యవహారం సరిగా తేలకపోవడంతో మళ్లీ గడువు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం పిటిషన్ వేసింది. దీంతో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పట్లో జరగబోవనే అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ పరిస్థితిని కవిత ఎత్తి చూపుతూ.. బీసీల హక్కుల కోసం ఉద్యమించాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తున్నారు.


ఆమె తెలంగాణ కాంగ్రెస్ పై మాత్రమే విమర్శలు కాకుండా.. జాతీయ నాయకత్వాన్ని కూడా ప్రశ్నించింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇప్పటివరకు పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదని ఆమె ప్రశ్నించారు. ఇది కేవలం రాష్ట్రపరమైన అంశం కాదు, జాతీయస్థాయిలో బీసీల న్యాయం కోసం పెద్ద పంథాలో ఉద్యమించాల్సిన అవసరముందని సూచించారు.


బీసీ రిజర్వేషన్ల అంశంపై స్పష్టమైన అజెండాతో ముందుకు వెళ్తూ.. కవిత తనను మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక ఆటగాడిగా నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈ రిజర్వేషన్ల అంశం పెద్ద చర్చనీయాంశం కానుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకపోతే ఏ ఎన్నికలు జరగరని కవిత స్పష్టంగా హెచ్చరించడం.. బీసీ సంఘాలను తన వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న సంకేతాలుగా కనిపిస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు వెనక్కి తగ్గేదేలే అంటూ కల్వకుంట్ల కవిత సష్టం చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa