తెలంగాణలో గ్రామీణ పరిపాలనలో సర్పంచ్ పాత్ర అత్యంత ప్రాముఖ్యమైనది. గ్రామ పంచాయతీకి ఎన్నుకోబడిన ప్రతినిధిగా సర్పంచ్ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేర్చడం మాత్రమే కాదు.. నేరుగా పరిష్కరించే అధికారాన్ని కూడా కలిగి ఉంటారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశంలో వీధిదీపాల నిర్వహణ బాధ్యతలను గ్రామ పంచాయతీలకు అప్పగించారు. ఈ నిర్ణయం సర్పంచ్ అధికారాల ప్రాధాన్యతను మరోసారి వెలుగులోకి తెచ్చింది.
సర్పంచ్‌కు ఉన్న ముఖ్యమైన అధికారాల్లో వీధిదీపాల ఏర్పాటు, మరమ్మతులు, నిర్వహణ ఒకటి. గ్రామంలోని విద్యుత్ స్తంభాలను సక్రమంగా సర్వే చేయించడం, లోపాలను గుర్తించి చర్యలు చేపట్టడం సర్పంచ్ బాధ్యతగా నిర్ణయించారు. ఇకపై వీధిదీపాల పనులు కేవలం ఇంజనీరింగ్ విభాగం పరిధిలోనే కాకుండా.. సర్పంచ్ పర్యవేక్షణలో నేరుగా జరగనున్నాయి.
అలాగే.. గ్రామ శుభ్రత, పారిశుధ్యం, చెత్త సేకరణ, డ్రైనేజీ సమస్యల పరిష్కారం వంటి అంశాలు కూడా సర్పంచ్ పరిధిలోకి వస్తాయి. పాఠశాలలు, ఆంగన్‌వాడీ సెంటర్లు, తాగునీటి సరఫరా వంటి ప్రాథమిక అవసరాలను తీర్చడం సర్పంచ్ ప్రధాన బాధ్యత. ప్రభుత్వ పథకాలు గ్రామస్థాయిలో అమలు అవుతున్నాయా లేదా అన్నది పర్యవేక్షించే అధికారం కూడా వారికి ఉంది. వీటితో పాటు.. వీధి దీపాల నిర్వహణకు సోలార్ పవర్ ను వినియోగించే దానిపై సాధ్యసాధ్యాలను పరిశీలించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఇక పంచాయతీ సమావేశాలు నిర్వహించి గ్రామస్థుల అభిప్రాయాలను సేకరించడం, అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడం, నిధుల వినియోగంలో పారదర్శకత పాటించడం కూడా సర్పంచ్ విధుల్లో ఒక భాగం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే నిధులను సమర్థంగా వినియోగించి రోడ్లు, కాలువలు, కమ్యూనిటీ హాల్స్ వంటి సదుపాయాలను అభివృద్ధి చేయడం సర్పంచ్ పనిగా ఉంటుంది.
ఇటీవల టెక్నాలజీని ఉపయోగించి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా వీధిదీపాలను పర్యవేక్షించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సమస్యలను ముందుగానే గుర్తించడం వంటి చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ మార్పులతో గ్రామీణ అభివృద్ధిలో సర్పంచ్ పాత్ర మరింత బలపడనుంది. మొత్తానికి.. సర్పంచ్ కేవలం ప్రజాప్రతినిధి మాత్రమే కాదు, గ్రామ అభివృద్ధి దిశలో ఒక ప్రధాన నిర్ణయాధికారి. వారికి ఉన్న అధికారాలను సమర్థంగా వినియోగిస్తే, గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక సౌకర్యాల లోటు తగ్గి, సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa