ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైడ్రా ప్ర‌జావాణికి 49 ఫిర్యాదులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 24, 2025, 11:20 AM

భారీ వ‌ర్షాలు కురుస్తున్న వేళ హైడ్రా ప్ర‌జావాణికి నాలాల ఆక్ర‌మ‌ణ‌ల‌పై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.  నాలాలు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురై వ‌ర‌ద నీరు సాఫీగా సాగ‌క త‌మ నివాస ప్రాంతాలు నీట మునుగుతున్నాయ‌ని ప‌లువురు మంగ‌ళ‌వారం హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. చెరువుల‌ను అనుసంధానం చేస్తూ సాగే నాలాలు క‌బ్జాల‌కు గురి అవ్వ‌డంతో పై నుంచి వ‌చ్చిన వ‌ర‌ద నేరుగా చెరువుకు వెళ్ల‌కుండా.. కాల‌నీల‌ను ముంచెత్తుతోంద‌ని ప‌లువురు ఫిర్యాదు చేశారు. ఇలా మంగ‌ళ‌వారం హైడ్రా ప్ర‌జావాణికి మొత్తం 49 ఫిర్యాదులు వ‌స్తే.. ఇందులో 30కి పైగా నాలా ఆక్ర‌మ‌ణ‌లు, వ‌ర‌ద ముంపునకు సంబంధించినవి ఉన్నాయి. చెరువుల తూములు మూసేయ‌డంతో పైన ఉన్న కాల‌నీలు నీట మునుగుతున్నాయ‌ని ప‌లువురు ఫిర్యాదులు చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ విలేజ్‌లో బందంకొమ్ము చెరువు నాలాను డైవ‌ర్ట్ చేయ‌డం వ‌ల్ల వ‌ర‌ద సాఫీగా సాగ‌క దాదాపు 8 కాల‌నీలు వ‌ర‌ద‌తో ఇబ్బందులు ప‌డుతున్నాయ‌ని స్థానికులు పెద్ద‌మొత్తంలో వ‌చ్చి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ప‌రిశీలించి.. ప‌రిష్కార బాధ్య‌త‌ల‌ను సంబంధిత అధికారుల‌కు అప్ప‌గించారు. కొన్ని చోట్ల‌కు తాను వ‌చ్చి ప‌రిశీలిస్తామ‌ని ఫిర్యాదుదారుల‌కు హామీ ఇచ్చారు. 


ఫిర్యాదులు ఇలా..
యూసుఫ్‌గూడ వ‌ద్ద ఉన్న కృష్ణ‌ న‌గ‌ర్‌లో మురుగు, వ‌ర‌ద నీరు ముంచెత్తుతోంద‌ని.. ఏమాత్రం వ‌ర్షం ప‌డినా ఇంట్లోంచి బ‌య‌ట‌కు రాలేక‌పోతున్నామ‌ని అక్క‌డి నివాసితులు ఫిర్యాదు చేశారు. నాలాల్లో పేరుకుపోయిన పూడిక‌ను తొల‌గించిన చోట ప్ర‌వాహం బాగున్నా.. మొత్తం క్లీన్ చేయ‌క‌పోవ‌డంతో స‌మ‌స్య‌త‌లెత్తుతోంద‌ని.. నాలాను విస్త‌రించాల‌ని అక్క‌డి నివాసితుల హైడ్రాకు విజ్ఞ‌ప్తి చేశారు.

శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం మియాపూర్ వ‌ద్ద ఉన్న మ‌యూరీన‌గ‌ర్‌లో వ‌ర‌ద నీరు పోయే నాలాను అబ్బులు అనే వ్య‌క్తి ఆక్ర‌మించి నిర్మించ‌డం వ‌ల్ల ఇబ్బందులు త‌లెత్తుతున్నాయ‌ని నివాసితులు ఫిర్యాదు చేశారు. నాలాను ఆక్ర‌మించి కంపౌండ్ వాల్ నిర్మించ‌డంతో నీరు సరిగా వెళ్లకపోవడం, కాలనీలో నీరు నిలిచిపోవడంతో నివాసితులు  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్ఫేర్ అసోసియేషన్ ప్ర‌తినిధులు తెలిపారు. 


 కూక‌ట్ప‌ల్లి మాధ‌విన‌గ‌ర్లో ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాన్ని బ‌య‌టి వ్య‌క్తులు వ‌చ్చి కాజేయాల‌ని చూస్తున్నార‌ని.. వేరే ద‌గ్గ‌రి డాక్యుమెంట్‌తో ఇక్క‌డి స్థ‌లాన్ని కొట్టేయాల‌నుకుంటున్నార‌ని మాధ‌విన‌గ‌ర్ వెల్ఫేర్ సొసైటీ వాళ్లు హైడ్రాకు పిర్యాదు చేశారు. 6 ఎక‌రాల మేర ఉన్న ఈ లేఔట్‌లో 500ల కుంటుంబాలు నివ‌సిస్తున్నాయ‌ని.. త‌మ‌కు వినియోగించుకునే అవ‌కాశం క‌ల్పించాల‌ని నివాసితులు కోరారు. 


రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండ‌లం త‌ట్టి అన్నారం విలేజ్ మీదుగా చిన్న కాలువ వెళ్తోంది. ఈ నాలాకు అడ్డంగా ప్ర‌హ‌రీ నిర్మించ‌డంతో వ‌ర‌ద నీరు నిలిచిపోతోంద‌ని.. త‌మ ఇంజినీరింగ్ క‌ళాశాల‌కు వ‌చ్చే విద్యార్థులు రాలేని ప‌రిస్థితి ఉంద‌ని శ్రేయ‌స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాల‌జీ ఫిర్యాదుచేసింది. దీనిపై స్థానిక మున్సిప‌ల్‌, ఇరిగేష‌న్ అధికారుల‌కు కూడా ఫిర్యాదు చేశామ‌ని అయినా ప్ర‌యోజ‌నం లేద‌ని వాపోయారు. 


 రంగారెడ్డి జిల్లా హ‌య‌త్‌న‌గ‌ర్ మండ‌లం సాహేబ్‌న‌గ‌ర్‌ఖ‌లాన్ ప‌రిస‌ర ప్రాంతాల్లోని కాల‌నీలు నాగార్జున సాగ‌ర్ రోడ్డు ప‌రిస‌రాల నుంచి వచ్చే వ‌ర‌ద‌తో నీట మునుగుతున్నాయ‌ని.. క‌ప్ప‌ల చెరువు పూర్తి స్థాయిలో నిండి పైన ఉన్న కాల‌నీలు కూడా నీట మునుగుతున్నాయ‌ని ప‌లువురు వాపోయారు. సాగ‌ర్ కాంప్లెక్స్ పేరిట మూడు ద‌శ‌ల్లో నిర్మించిన నివాసాలు హ‌రిహ‌ర‌పురంతో పాటు ప‌లు కాల‌నీల‌కు వ‌ర‌ద ముప్పు త‌ప్పించాల‌ని హైడ్రాకు ఫిర్యాదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa