హైదరాబాద్ జీవశాస్త్ర రంగంలో తన ప్రాధాన్యతను మరింత బలపరుచుకుంటోందని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఆయన తాజాగా నగరంలో దేశంలోని తొలి హెల్త్‌కేర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే హైదరాబాద్ ఐటీ, ఫార్మా రంగాల కేంద్రంగా గుర్తింపు పొందిందని, ఇప్పుడు ఆరోగ్యరంగంలో కూడా ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంటోందని అన్నారు. హాస్పిటాలిటీ రంగంలో ప్రారంభించిన జీసీసీ తరువాత.. హెల్త్‌కేర్‌లో ఇలాంటిది మొదటిసారిగా హైదరాబాద్‌లో ఏర్పడటం గర్వకారణమని పేర్కొన్నారు.
జీవశాస్త్ర పరిశ్రమల ఎదుగుదల దశాబ్దాల క్రితం బల్క్ డ్రగ్ యూనిట్స్‌తో ప్రారంభమైందని మంత్రి గుర్తు చేశారు. ప్రస్తుతం సుమారు 800కి పైగా ఫార్మా కంపెనీలు హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని పనిచేస్తున్నాయని వివరించారు. ఔషధాలు, బయోలాజిక్స్, టీకాలు, ప్రత్యేక ఔషధాల తయారీలో నగరం ఒక గ్లోబల్ హబ్‌గా నిలుస్తోందని అన్నారు. నైపుణ్యాల పెంపు కోసం ప్రభుత్వం లైఫ్ సైన్స్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తోందని పేర్కొన్నారు.
హెచ్‌సీఏ హెల్త్‌కేర్ వంటి అంతర్జాతీయ సంస్థ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడం, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు. ప్రజలకు తక్కువ ఖర్చుతో, నాణ్యమైన వైద్య సేవలు అందేలా చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని.. ఈ క్రమంలో సంస్థల సహకారాన్ని స్వాగతిస్తామని తెలిపారు. హైదరాబాద్ భవిష్యత్తులో ప్రపంచ ఆరోగ్య సేవల ప్రధాన కేంద్రంగా ఎదుగుతుందనే విశ్వాసాన్ని మంత్రి వ్యక్తం చేశారు.
హైటెక్ సిటీలోని సత్వా నాలెడ్జ్ పార్క్‌లో ఏర్పాటైన ఈ కేంద్రం అమెరికా, యూకేలోని 192 ఆసుపత్రులు, 2500కిపైగా క్లినిక్స్‌కి సంబంధిత కార్యకలాపాలను నిర్వహించనుంది. సుమారు 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు అంతస్తుల భవనంలో ఏర్పాటు చేసిన ఈ జీసీసీపై రూ.650 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఎమిలీ డంకన్ వెల్లడించారు.
ప్రస్తుతం 1200 ఉద్యోగులు పనిచేస్తుండగా.. త్వరలో ఆ సంఖ్యను 3,000కి పెంచుతామని తెలిపారు. ఇప్పటికే యునైటెడ్ హెల్త్ గ్రూప్, నోవార్టిస్ వంటి ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు ఇక్కడ తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు హెచ్‌సీఏ హెల్త్‌కేర్ చేరికతో నగరం మరింత వేగంగా ముందుకు సాగి.. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలు పెరగనున్నాయి. హెచ్‌సీఏ హెల్త్‌కేర్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అతుల్ కపూర్ మాట్లాడుతూ.. ఈ కేంద్రం ద్వారా ఆరోగ్య సేవలు మరింత విస్తృతం కావడంతో పాటు, నాణ్యత కూడా పెరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, లైఫ్‌సైన్సెస్ బోర్డు ఛైర్మన్ శక్తి నాగప్పన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa