ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 02, 2025, 07:27 PM

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ స్థానంలో పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహరచన ప్రారంభించారు. ఇందులో భాగంగా, గెలుపు అవకాశాలున్న బలమైన అభ్యర్థిని గుర్తించే కీలక బాధ్యతను ఆయన ముగ్గురు మంత్రులు, పీసీసీ అధ్యక్షుడితో కూడిన బృందానికి అప్పగించారు.ముఖ్యమంత్రి తన నివాసంలో ఈ అంశంపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హాజరుకాగా, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి ఎంపికపై ప్రధానంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో అన్ని అంశాలను బేరీజు వేసి, గెలిచే సత్తా ఉన్న ముగ్గురు ఆశావహుల పేర్లతో సమగ్ర నివేదికను తనకు అందించాలని సీఎం వారిని ఆదేశించారు.అభ్యర్థి ఎంపిక విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని, అత్యంత పకడ్బందీగా వ్యవహరించాలని సీఎం స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సామాజిక సమీకరణాలు, అభ్యర్థి వ్యక్తిగత బలం, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు, ప్రత్యర్థి పార్టీల బలాబలాలను అంచనా వేసి నివేదికను రూపొందించాలని సూచించారు. ఈ నివేదిక ఆధారంగానే తుది అభ్యర్థిని ఖరారు చేయాలనేది కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచనగా కనిపిస్తోంది.ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపైనా చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఇన్‌ఛార్జి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ ప్రచార కార్యక్రమాలకు నాయకత్వం వహించి, పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపాలని ఆయన కోరారు.హైదరాబాద్ నగరంలోని కీలక నియోజకవర్గాల్లో ఒకటైన జూబ్లీహిల్స్‌లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికను ఒక సవాలుగా తీసుకుని, తమ సత్తా చాటాలని భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి మార్గనిర్దేశంలో పార్టీ అగ్రనేతలు చేపట్టిన ఈ కసరత్తు ఎలాంటి ఫలితాలనిస్తుందో వేచి చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa