ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక తేదీ వచ్చేసింది

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 06, 2025, 07:50 PM

తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఉపఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో హైదరాబాద్‌లోని ఈ కీలకమైన నియోజకవర్గంలో తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఢిల్లీలో మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరగబోయే పలు ఉపఎన్నికల షెడ్యూల్‌ను వెల్లడించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించిన తేదీలు ఇలా ఉన్నాయి.


నామినేషన్ల స్వీకరణ ప్రారంభం: అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 21 వరకు,


నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: అక్టోబర్ 24, 2025


పోలింగ్ తేదీ: నవంబర్ 11, 2025


కౌంటింగ్, ఫలితాల ప్రకటన: నవంబర్ 14, 2025


2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన మాగంటి గోపీనాథ్.. అనారోగ్యం కారణంగా ఈ ఏడాది జూన్ 8న కన్నుమూశారు. దీంతో ఈ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన మాగంటి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన గులాబీ గూటికి చేరారు. 2018లో కారు గుర్తుపై పోటీ చేసిన ఆయన రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2023లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించారు.


రాజకీయ ప్రాధాన్యత.. హైదరాబాద్‌పై ప్రభావం..


హైదరాబాద్‌ నగరంలో ఉన్న ఈ నియోజకవర్గం ఆర్థికంగా, సామాజికంగా అత్యంత ముఖ్యమైనది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, గత ఎన్నికల్లో గెలిచిన బీఆర్‌ఎస్‌కు ఈ స్థానం అత్యంత కీలకం. ఈ ఎన్నికల ఫలితం రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ నాయకత్వం జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై సుదీర్ఘ కసరత్తు చేసి.. నలుగురు కీలక నేతలతో కూడిన సంక్షిప్త జాబితాను ఏఐసీసీ కి పంపింది. ఈ జాబితాలో నవీన్ యాదవ్, సీఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్ వంటి నేతల పేర్లు ఉన్నాయి. కాంగ్రెస్ అధిష్ఠానం త్వరలోనే తుది అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.


బీఆర్‌ఎస్, బీజేపీ వైఖరి..


ముఖ్య ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఈ ఉపఎన్నికలో తమ సిట్టింగ్ బలాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతకు టికెట్‌ను కేటాయించారు. ఇక మరోవైపు భారతీయ జనతా పార్టీ (BJP) కూడా ఇక్కడ తమదైన శైలిలో పోటీని పెంచేందుకు సమాయత్తమవుతోంది. అభ్యర్థి ఎంపిక కోసం ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఇలా జూబ్లీహిల్స్‌లో త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉంది. ఈ ఉపఎన్నికలో విజయం సాధిస్తే.. అది రాష్ట్రంలో ఏ పార్టీ ప్రజల ఆమోదాన్ని కలిగి ఉందో రుజువు చేస్తుంది.


మరో ముఖ్యమైన రాజకీయ పరిణామం ఏమిటంటే.. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో ఉన్న న్యాయ వివాదం. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా కీలక మంత్రులు 42 శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో బలమైన వాదనలు వినిపించడం కోసం ఢిల్లీలోని సీనియర్ న్యాయవాదులతో చర్చలు జరపడం, రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీల మద్దతు పొందడానికి కాంగ్రెస్ చేస్తున్న వ్యూహాత్మక ప్రయత్నంగా కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, బీసీ రిజర్వేషన్ల వివాదం.. ఈ రెండూ తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికరమైన మలుపులకు దారితీసే అవకాశం ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa