ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ వర్షాలు, వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు.. రూ.15 వేల చొప్పున సాయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 11, 2025, 07:16 PM

మొంథా తుపాను కారణంగా ఇటీవల రాష్ట్రంలో సంభవించిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన వేలాది కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. వరద నష్టాన్ని అంచనా వేసిన వెంటనే.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, దెబ్బతిన్న ఇళ్లకు తక్షణ సహాయం కింద ప్రభుత్వం ఏకంగా రూ. 12.99 కోట్ల నిధులను విడుదల చేసింది. రెవెన్యూ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా.. మోంథా తుపాను ప్రభావంతో ఇళ్లు పూర్తిగా లేదా పాక్షికంగా దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తాన్ని ఎలాంటి ఆలస్యం లేకుండా, నేరుగా బాధితుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇది వరద బాధితులకు తాత్కాలికంగా ఉపశమనం కలిగించే గొప్ప ప్రయత్నంగా చెప్పుకోవచ్చు.


గత అక్టోబర్ 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వరుసగా నాలుగు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వరంగల్, హన్మకొండ, వికారాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, యాదాద్రి భువనగిరి వంటి మొత్తం 16 జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ జిల్లాల్లో పంట నష్టంతో పాటు, ముఖ్యంగా నివాస గృహాలు భారీగా ధ్వంసమయ్యాయి.


ఈ విపత్తు సమయంలో నష్ట తీవ్రతను అంచనా వేయడానికి ఆయా జిల్లాల కలెక్టర్లు రంగంలోకి దిగారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. నష్టం జరిగిన ఇళ్ల సంఖ్యను లెక్కించి, ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. కలెక్టర్లు సమర్పించిన నివేదికల ప్రకారం.. మొత్తం 8,662 ఇళ్లు దెబ్బతిన్నట్లు తేలింది. ఈ దెబ్బతిన్న ఇళ్ల పునరుద్ధరణ, మరమ్మతుల కోసం రూ.15,000 సాయం ఎంతగానో ఉపయోగపడనుంది.


ప్రభుత్వం తీసుకున్న ఈ తక్షణ చర్య.. విపత్తు వేళ బాధితుల పట్ల తన బాధ్యతను చాటుకుంది. త్వరలోనే నష్టపోయిన రైతుల పంటల లెక్కలు కూడా తేల్చి.. వారికి కూడా ప్రత్యేక సహాయం అందించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక సహాయం ప్రజలకు తక్షణ ఉపశమనాన్ని ఇవ్వడంతో పాటు.. ధ్వంసమైన ఇళ్లను పునర్నిర్మించుకోవడానికి కొంత బలాన్ని ఇస్తుందని చెప్పవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa