తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన అత్యంత కీలకమైన ఎన్నిక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌కు ప్రతిష్ఠాత్మక సవాలుగా మారిన ఈ ఎన్నికలో.. నవీన్ యాదవ్ విజయం సాధించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి, ప్రభుత్వానికి భారీ ఊపునిచ్చింది. ఈ ఎన్నికలో ముఖ్యమంత్రి, మొత్తం కాంగ్రెస్ కేబినెట్ ఒకవైపు, బీఆర్‌ఎస్ అధినాయకత్వం మరోవైపు నిలబడి హోరాహోరీగా పోరాడాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఎన్నికలో గెలిచినందున.. నవీన్ యాదవ్‌కు దానికి తగ్గ రివార్డు (మంత్రి పదవి) దక్కుతుందా అనే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో బలంగా నడుస్తోంది. పరిస్థితులు కూడా అందుకు అనుకూలంగా ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు బీసీ (వెనుకబడిన తరగతుల) నినాదాన్ని బలంగా వినిపించింది. రాష్ట్రంలో బీసీలకు సముచిత స్థానం కల్పించే ఉద్దేశంతోనే కుల గణన చేపట్టింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కట్టబెట్టడానికి ప్రయత్నించినా.. కోర్టుల అడ్డంకులు, కేంద్రం నుంచి మద్దతు లేకపోవడంతో ఆ ప్రయత్నం పూర్తిగా ఫలించలేదు. అందుకే.. బీసీలకు కేబినెట్‌లో మరిన్ని స్థానాలు కల్పించాలనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది.
ప్రస్తుత కేబినెట్‌లో ఉన్న బీసీ మంత్రి కొండా సురేఖతో కొన్ని పాలనాపరమైన ఇబ్బందులు ఉన్నాయనే చర్చ నడుస్తోంది. ఒకవేళ ఆమెను మార్చాల్సి వస్తే.. ఆ స్థానం కూడా బీసీలకే దక్కుతుంది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి కల్పించాలని కూడా కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాబట్టి.. రాబోయే మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు లేదా ముగ్గురు బీసీ నేతలకు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. ఈ అవకాశాన్ని నవీన్ యాదవ్ అందిపుచ్చుకునే అవకాశం ఉంది.
నవీన్ యాదవ్‌కు మంత్రి పదవి దక్కడానికి కేవలం బీసీ కోటా మాత్రమే కాదు, ఇతర సమీకరణాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్, హైదరాబాద్‌కు గుండెకాయ లాంటిది. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించడం పార్టీకి కచ్చితంగా ఒక అడ్వాంటేజ్. గతంలో హైదరాబాద్‌కు మంత్రివర్గంలో సరైన ప్రాతినిధ్యం లేదనే లోటు ఉండేది. ఇటీవల మహమ్మద్ అజారుద్దీన్‌కు పదవి ఇచ్చినా.. నవీన్ యాదవ్‌కు అవకాశం దక్కితే మహానగరానికి మరింత బలమైన ప్రాతినిధ్యం దొరుకుతుంది.
హైదరాబాద్‌లో నవీన్ యాదవ్‌కు చెందిన యాదవ సామాజిక వర్గం ప్రభావం చాలా ఎక్కువ. దాదాపు ప్రతీ నియోజకవర్గంలో వీరి ఓటు ఇంపాక్ట్ ఉంటుంది. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో తలసాని శ్రీనివాస యాదవ్ ఈ వర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత కేబినెట్లో ఈ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదు. ఈ లోటును తీర్చడానికి నవీన్ సరైన ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా గెలిచినా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ బోల్తా పడింది. రాబోయే స్థానిక సంస్థలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు.. పార్టీకి సామాజిక వర్గ దన్ను, అంగబలం, అర్థబలం ఉన్న బలమైన గ్రేటర్ నేత అవసరం. నవీన్ యాదవ్‌కు మించిన ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో ముఖ్యమంత్రి సహా మొత్తం 12 మంది మంత్రులు ఉన్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. తెలంగాణలో మరో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
నవీన్ యాదవ్ సీనియర్ కాకపోవడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండటం వలన, ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం సీఎంకు కంఫర్ట్‌గా ఉంటుంది. ఇన్ని సామాజిక, రాజకీయ, ప్రాంతీయ సమీకరణాలు నవీన్ యాదవ్‌కు అనుకూలంగా ఉండటంతో.. రాబోయే విస్తరణలో ఆయనకు మంత్రి పదవి దక్కే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa