ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో 40 వేల ఉద్యోగాలు..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 03, 2025, 07:31 PM

నిరుద్యోగులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక యువత ఆకాంక్షలను గుర్తించి 61,379 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. ఈ క్రమంలోనే మరో 40 వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలన పూర్తయ్యేసరికి లక్ష ఉద్యోగాల మార్క్‌ను అందుకుంటామని చెప్పారు. విద్య, నీటిపారుదలపై కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టిందన్నారు. ఈ మేరకు ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా బుధవారం (డిసెంబర్ 3న) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‎లో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు.


ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. బహుజన సామ్రాజ్యం కోసం సర్దార్ సర్వాయి పాపన్న పునాదులు వేశారన్న సీఎం.. 2001లో హుస్నాబాద్ ప్రాంతం నుంచే తెలంగాణ ఉద్యమం మొదలైందని గుర్తుచేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని 2004న కరీంనగర్ గడ్డపై ఇచ్చిన మాటను.. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నిలబెట్టుకున్నారన్నారు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ స్పూర్తితోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. హుస్నాబాద్ అంటే తనకు సెంటిమెంట్ అని మాజీ సీఎం కేసీఆర్ చెబుతారని.. కానీ బీఆర్ఎస్ పాలనలో హుస్నాబాద్ నిర్లక్ష్యం చేశారన్నారు. ఈ ప్రాంతంలోని కుండపల్లి, గౌరెల్లి రిజర్వాయర్లు పూర్తి చేసే బాధ్యత తనదే అని సీఎం రేవంత్ చెప్పారు.


70,011 ఉద్యోగాలు భర్తీ..


తాము అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు రాష్ట్రంలో 61,379 ఉద్యోగాలు భర్తీ చేశామని కాంగ్రెస్ చెబుతోంది. మరో 8632 పోస్టుల నియామకాలు తుది దశలో ఉన్నాయని తెలిపింది. వీటితో కలిపితే మొత్తం ఉద్యోగ నియామకాల సంఖ్య 70,011 చేరుతుందని.. త్వరలోనే లక్ష ఉద్యోగాల మార్క్‌ను అందుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వెల్లడించింది.


ప్రభుత్వం వివరాల ప్రకారం.. రెండేళ్లలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 15,780 ఉద్యోగాలు భర్తీ చేశారు. తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 16,067 ఉద్యోగాలు, మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డులో 8,666 పోస్టులు, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్‌టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డులో 8,400 ఉద్యోగాలు భర్తీ చేశారు. ఇక డీఎస్సీ ద్వారా 10,006 నియామకాలు చేపట్టారు. విద్యుత్ రంగంలో టీజీజెన్‌కో , టీజీఎన్‌పీడీసీఎల్‌లో 1,105 ఉద్యోగాలు భర్తీ చేశారు. ఇక సింగరేణి, ఇతర సంస్థలు కలిపి 1,355 ఖాళీలను పూర్తి చేశారు. మొత్తంగా ఇప్పటివరకు 61,379 పోస్టులను భర్తీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక వైద్య రంగంలో 7,267 ఉద్యోగాలు, నియామక ప్రక్రియ కొనసాగుతోంది. 1,365 గ్రూప్ 3 పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతోంది. అంటే ఈ నియామకాలు పూర్తైతే మొత్తం సంఖ్య 70,011కు చేరుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa