ప్రొఫెసర్ అంటే ఉద్యోగం కాదు.. అది ఒక పవిత్రమైన బాధ్యత. రేపటి సమాజాన్ని తీర్చిదిద్దే యువతకు పాఠాలు చెప్పి.. మార్గదర్శనం చేయాల్సిన స్థానంలో ఉన్న ఒక వ్యక్తి.. ఇంతటి నీచమైన పనులకు పాల్పడటం క్షమించరాని నేరం. విద్యాబుద్ధులు నేర్పే ఆలయం లాంటి విశ్వవిద్యాలయంలో ఇలాంటి దారుణాలు చోటుచేసుకోవడం.. యావత్ మానవత్వానికే సిగ్గుచేటు. హైదరాబాద్లోని ప్రముఖ జవహర్లాల్ నెహ్రూ టెక్నొలాజికల్ యూనివర్సిటీలో జరిగిన ఒక ఘటన విద్యా వ్యవస్థకే మచ్చ తెచ్చింది.
నమ్మించి మోసం...
జేఎన్టీయూలో పనిచేసే ఒక ప్రొఫెసర్, అదే యూనివర్సిటీలో ఉన్న ఒక గెస్ట్ ఫ్యాకల్టీ మహిళపై దారుణానికి ఒడిగట్టాడు. వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారమని నమ్మించి.. మొదట బాధితురాలిని తన బుట్టలో వేసుకున్నాడు. ఆ తర్వాత అసలు రంగు బయటపెట్టాడు.
ఆ ప్రొఫెసర్.. నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తాను అంటూ నిత్యం బెదిరింపులకు పాల్పడుతూ.. ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. భయంతో ఆమె ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేకపోయింది. పని ఉందనే సాకుతో బాధితురాలిని అర్ధరాత్రి వరకు తన ఛాంబర్లో ఉంచుకోవడం.. దీనివల్ల ఆమె భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం.. చివరకు ఆ ప్రొఫెసర్ ఆమె కాపురాన్ని కూడా కూల్చేయడం జరిగింది.
ఒంటరిగా ఉంటున్న బాధితురాలి నిస్సహాయతను అవకాశంగా మలుచుకున్న ఆ కీచక ప్రొఫెసర్, శారీరకంగా.. మానసికంగా మరింతగా వేధించాడు. రోజురోజుకూ ప్రొఫెసర్ వేధింపులు పెరిగిపోవడంతో.. వాటిని తట్టుకోలేకపోయిన బాధితురాలు తీవ్ర మానసిక వేదనకు గురైంది. ఆఖరికి ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించగా.. కేపీహెచ్బీ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
జీఎన్టీయూ లాంటి విద్యా సంస్థలో ఇలాంటి ఘటన జరగడంతో.. అక్కడ చదువుతున్న విద్యార్థులు.. పనిచేస్తున్న ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రొఫెసర్ వృత్తికి మచ్చ తెచ్చిన ఈ నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి దారుణాలు మరోసారి జరగకుండా ఉండాలంటే.. విద్యా సంస్థల్లో మహిళల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa