ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్క రూపాయితో.. అన్నం, పప్పు, కూర, పెరుగుతో కూడిన సంపూర్ణ భోజనం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 15, 2025, 07:36 PM

ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్న తరుణంలో.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని కరుణ కిచెన్ నిరుపేదలకు, నిరాశ్రయులకు నిజమైన అక్షయపాత్రలా మారింది. కేవలం ఒక్క రూపాయికే కడుపు నిండా.. నాణ్యమైన భోజనాన్ని అందిస్తూ ఈ మహత్తర సేవను అందిస్తోంది. ఆకలి లేని సమాజం కోసం కృషి చేయాలనే లక్ష్యంతో ఈ కిచెన్ వేలాది మంది ఆకలిని తీరుస్తోంది.


కరుణ కిచెన్ వ్యవస్థాపకులు రాకేష్ తమ సేవ వెనుక ఉన్న ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. "సేవకు ప్రచారం అవసరం లేదు. మా లక్ష్యం కేవలం ఒక్కటే.. భారతదేశంలో ఎవరూ ఆకలితో ఉండకూడదు," అని ఆయన పేర్కొన్నారు. ఆకలి అనేది అత్యంత బాధాకరమైనదని.. దాన్ని తీర్చడానికి తాము చేస్తున్న చిన్న ప్రయత్నమని ఆయన తెలియజేశారు.


సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని ఆటో డ్రైవర్లు , హమాలీలు , రోజువారీ కూలీలు, నిరాశ్రయులు, వృద్ధులు... ఇలా ఎందరికో కరుణ కిచెన్ నిత్యం భోజనం పెడుతూ అందరి మన్ననలు పొందుతోంది.


కేవలం రూపాయికే భోజనం అందిస్తున్నప్పటికీ.. కరుణ కిచెన్ వంటకాల నాణ్యతలో మాత్రం ఎక్కడా రాజీ పడటం లేదు. ప్రతి రోజు మధ్యాహ్నం వేళ రుచికరమైన , ఆరోగ్యకరమైన భోజనాన్ని అందిస్తున్నారు. మెనూలో అన్నం, పప్పు, కూర, పెరుగుతో కూడిన సంపూర్ణ భోజనం ఉంటుంది. కిచెన్‌లో పరిశుభ్రత, నాణ్యత నిర్వహణ అత్యంత ఉన్నతంగా ఉంటుందని అక్కడికి వచ్చే లబ్ధిదారులు చెబుతున్నారు.


భోజనం చేస్తున్న ఆటో డ్రైవర్లు తమ అనుభవాన్ని పంచుకుంటూ.. బయట హోటల్‌లో కనీసం రూ. 50 ఖర్చవుతుందని.. ఆ డబ్బులు ఇప్పుడు మిగులుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. "రూపాయికే ఇంత మంచి భోజనం దొరకడం మా అదృష్టం. ఇది నిజంగా దేవుడిచ్చిన వరం," అని వారు తెలిపారు. కరుణ కిచెన్ అందిస్తున్న ఈ నిస్వార్థ సేవకు దాతల నుంచి కూడా అద్భుతమైన స్పందన లభిస్తోంది. స్థానిక వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు, అనేక మంది సామాన్య ప్రజలు తమకు తోచిన విధంగా కిచెన్‌కు సరుకులు లేదా నగదు రూపంలో సహాయం అందిస్తున్నారు. ఈ నిరంతర సహాయంతోనే కరుణ కిచెన్ తన సేవను కొనసాగిస్తోంది. ఈ కిచెన్ కేవలం ఆకలిని తీర్చడమే కాకుండా.. పేదరికంపై పోరాటంలో మానవత్వం విలువను, దాతృత్వం శక్తిని చాటి చెబుతోంది. ఈ స్ఫూర్తిదాయకమైన సేవ మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని స్థానికులు బలంగా కోరుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa