ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘దమ్ముంటే రా తేల్చుకుందాం..’కేసీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 21, 2025, 09:33 PM

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీటుగా బదులిచ్చారు. పదేళ్ల పాలనలో తెలంగాణను రూ. 8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిన కేసీఆర్ ఒక "ఆర్థిక ఉగ్రవాది" అని రేవంత్ మండిపడ్డారు. కలుగులో దాక్కున్న ఎలుకలా ఇన్నాళ్లూ మౌనంగా ఉండి.. ఇప్పుడు బయటకు వచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దమ్ముంటే జనవరి 2న జరిగే అసెంబ్లీ సమావేశాలకు రావాలని.. తెలంగాణకు ఎవరు మేలు చేశారో అక్కడే తేల్చుకుందామని సవాల్ విసిరారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా కేసీఆర్ తీరు మారలేదని.. కమీషన్ల కోసమే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు.


తెలంగాణ రాజకీయాలు మరోసారి రణరంగంగా మారాయి. ఆదివారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ చేసిన విమర్శలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ఘాటుగా బదులిచ్చారు. కేసీఆర్ మారుతారని ఆశించానని.. కానీ ఆయన భాషలో గానీ, అబద్ధాలు చెప్పే అలవాటులో గానీ ఎలాంటి మార్పు రాలేదని ఎద్దేవా చేశారు. కలుగులో దాక్కున్న ఎలుక బయటకు వచ్చినట్లుగా.. ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చి అసత్యాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.


కేసీఆర్ కేవలం ప్రెస్ మీట్‌లకే పరిమితం కాకుండా.. ప్రజల పక్షాన నిలబడాలంటే సభకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ‘వచ్చే జనవరి 2వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాం. దమ్ముంటే కేసీఆర్ సభకు రావాలి. తెలంగాణకు ఎవరు మేలు చేశారు, ఎవరు అన్యాయం చేశారో అక్కడే తేల్చుకుందాం’ అని రేవంత్ స్పష్టం చేశారు.


కేసీఆర్ తన కుటుంబ ప్రయోజనాల కోసం తెలంగాణను తాకట్టు పెట్టారని.. ఇప్పుడు అధికారంలో లేకపోయేసరికి మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ అస్తవ్యస్తం చేశారని రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణను రూ. 8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని.. ఆయన ఒక "ఆర్థిక ఉగ్రవాది" అని సంచలన వ్యాఖ్యలు చేశారు.


రాష్ట్రానికి నాలుగు వైపుల నుండి ఆదాయం వచ్చే మార్గాలు ఉన్నా.. కేవలం కమీషన్ల కోసమే ప్రాజెక్టుల అంచనాలను పెంచి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని దుయ్యబట్టారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‌కు వాత పెట్టారని.. అందుకే ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారన్నారు. గజ్వేల్‌లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరడం కేసీఆర్ పతనానికి నిదర్శనమని పేర్కొన్నారు.


కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను రేవంత్ కొట్టిపారేశారు. ఉద్యమ సమయంలో పాలమూరు ప్రజలను కేసీఆర్ మోసం చేశారని.. కేవలం ఓట్ల కోసమే సెంటిమెంట్‌ను వాడుకున్నారని విమర్శించారు. చంద్రబాబుతో లాలూచీ పడి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే పెండింగ్ ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తున్నామని.. ప్రజల ఆస్తుల విలువలు తగ్గలేదు సదా పెరుగుతున్నాయని ధీమా వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa