ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్త కిడ్నీలు, లివర్, గుండె, ఊపిరితిత్తులను దానం.. భర్త మృతిలో అమరత్వం చూసిన ఇల్లాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 22, 2025, 07:35 PM

విధి ఒక్కసారిగా విరుచుకుపడితే కుటుంబాలే కూలిపోతాయి. కానీ ఆ దుఃఖంలోనూ సమాజం కోసం ఆలోచించే మనసులు చాలా అరుదు. అలాంటి అరుదైన మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది ఉప్పల్‌కు చెందిన రైల్వే ఉద్యోగి శ్రీనివాస్ మర్రి కుటుంబం. హైదరాబాద్ ఉప్పల్, మల్లాపూర్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ మర్రి (38) రైల్వే శాఖలో ఎలక్ట్రిషియన్‌గా పని చేస్తున్నారు. డిసెంబర్ 13న విధి నిర్వహణలో భాగంగా రైలు పైభాగంలో మెకానికల్ పనులు చేస్తుండగా.. అదుపు తప్పి సుమారు 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడిపోయారు. తీవ్ర గాయాలతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను రైల్వే ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అనంతరం ప్రైవేట్ ఆసుపత్రికి మార్చారు.


అయితే.. ఎన్నో ప్రయత్నాల తర్వాత కూడా వైద్యులు డిసెంబర్ 21 రాత్రి 11:18 గంటలకు శ్రీనివాస్ మర్రిని బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు. ఆ క్షణం ఆ కుటుంబానికి మాటల్లో చెప్పలేని విషాదాన్ని మిగిల్చింది. అలాంటి పుట్టెడు దుఃఖంలోనూ శ్రీనివాస్ మర్రి సతీమణి రత్నకుమారి తీసుకున్న నిర్ణయం మానవత్వానికి కొత్త అర్థాన్ని చెప్పింది. ఆయన కిడ్నీలు, లివర్, గుండె, ఊపిరితిత్తులను దానం చేయడానికి ఆమె అంగీకరించారు. ఆ ఒక్క నిర్ణయంతో ఐదుగురి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. ఈ అవయవదానం ద్వారా మరో ఐదుగురు రోగులకు పునర్జన్మ లభించింది. భర్త శరీరం మట్టిలో కలిసిపోయినా.. ఆయన అవయవాల ద్వారా ఆయన జీవితం కొనసాగుతుందనే భావన ఆ కుటుంబానికి కొంత ఊరటనిచ్చింది.


ఈ సందర్భంగా జీవన్‌దాన్ తెలంగాణ కార్యక్రమం శ్రీనివాస్ మర్రి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ ఏడాది ఇప్పటివరకు 199 బ్రెయిన్ డెడ్ అవయవదానాలు జరగగా.. శ్రీనివాస్ మర్రి దానం 200వ అవయవదానంగా నమోదు కావడం విశేషం. ఇక గుండె మార్పిడి కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి నుంచి పంజాగుట్ట నిమ్స్ వరకు హైదరాబాద్ సిటీ పోలీసులు ఏర్పాటు చేసిన ‘గ్రీన్ ఛానల్’ మరో ప్రాణాన్ని కాపాడింది. 8 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 9 నిమిషాల్లో గుండెను తరలించి వైద్యులు సకాలంలో శస్త్రచికిత్స చేయగలిగారు.


ఈ మొత్తం ఘటనను హైదరాబాద్ సీపీ సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకుంటూ.. ‘విధి చిన్నచూపు చూసినా.. విచక్షణ కోల్పోని ఆ ఇల్లాలు, తన భర్త మరణంలోనూ అమరత్వాన్ని చూసింది. అవయవదానం చేద్దాం.. ఆపదలో ఉన్నవారికి పునర్జన్మనిద్దాం” అని పిలుపునిచ్చారు. పుట్టెడు దుఃఖంలోనూ సమాజం కోసం ఆలోచించిన రత్నకుమారి త్యాగం నిజంగా ఆదర్శప్రాయం. మానవత్వం ఇంకా బతికే ఉందని మరోసారి నిరూపించిన ఈ కుటుంబానికి సమాజం మొత్తం తల వంచి సెల్యూట్ చేయాల్సిందే.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa