తెలంగాణలోని సాగునీటి పారుదల ప్రాంతాల్లో యాసంగి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ తరుణంలో రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీపై స్పష్టత వస్తోంది. తాజా పరిస్థితులను బట్టి చూస్తే.. ఈ నిధుల జమ ప్రక్రియ ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారానికి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కసరత్తులే ఈ జాప్యానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
శాటిలైట్ సర్వేతో పక్కాగా లబ్ధిదారులు..
గతంలో సాగులో లేని భూములకు, రియల్ ఎస్టేట్ ప్లాట్లకు కూడా నిధులు మంజూరయ్యేవనే విమర్శలు ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈసారి శాటిలైట్ మ్యాపింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అగ్రికల్చర్ యూనివర్సిటీ పర్యవేక్షణలో రాష్ట్రవ్యాప్తంగా సాగు భూముల గుర్తింపు ప్రక్రియ జరుగుతోంది. స్పేస్ టెక్నాలజీ ద్వారా ప్రస్తుతం ఏ ఏ భూముల్లో పంటలు సాగులో ఉన్నాయో లెక్క తేల్చనున్నారు. ఈ నివేదిక వచ్చిన తర్వాతే అర్హులైన రైతుల ఖాతాల్లోకి నిధులు వెళ్తాయి.
నిజానికి సంక్రాంతి పండుగ లోపే ఈ సాయం అందించాలని ప్రభుత్వం తొలుత భావించింది. కానీ.. శాటిలైట్ సర్వే రిపోర్టులు అందడం ఇంకా పూర్తి కాలేదు. సర్వే నివేదికలు వచ్చిన తర్వాత వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు మరికొంత సమయం పట్టేలా ఉంది. ఆదివారం మేడారంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో కూడా ఈ నిధుల విడుదలపై నిర్దిష్టమైన నిర్ణయం వెలువడకపోవడంతో రైతులు ఫిబ్రవరి లేదా మార్చి వరకు వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వం ఈసారి ‘అర్హులకే సాయం’ అనే నినాదంతో ముందుకు వెళ్తోంది. దీనివల్ల కొన్ని వర్గాలకు రైతు భరోసా నిలిచిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం పంట వేయని భూములకు ఈ విడత సాయం అందే అవకాశం చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పెట్టుబడి సాయం అందక రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం త్వరితగతిన సర్వే పూర్తి చేసి.. మార్చి నాటికైనా నిధులు విడుదల చేస్తే ఎరువులు, కూలీల ఖర్చులకు వెసులుబాటు కలుగుతుందని అన్నదాతలు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa